Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే గడువు ఉన్న సమయంలో కాంగ్రెస్ లో తుంగతుర్తి పంచాయతీ ఒక కొలిక్కి వచ్చింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో అనేక మంది ఆశావహులు ఉండటం, వారికి సీనియర్ నేతల మద్దతు, లాబీయింగ్ నేపథ్యంలో చివరి వరకూ ఈ తుంగతుర్తి అంశం ఉత్కంఠను కల్గిస్తూ వచ్చింది. గాంధీ భవన్ నుండి ఢిల్లీ వరకూ జరిగిన చర్చలు, జిల్లా సీనియర్ నాయకుల అభ్యర్థనలు, అభ్యర్ధుల విజయావకాశాలు. ఓట్ల చీలిక తదితర విషయాలపై తర్జన భర్జనల అనంతరం పార్టీ అధిష్టానం తుంగతుర్తి అభ్యర్ధిత్వాన్ని బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మందుల శామ్యూల్ కు ఖరారు చేసింది.
ఈ నియోజకవర్గం నుండి సీటు ఆశిస్తున్న అద్దంకి దయాకర్ 2014 ఎన్నికల్లో 2,379 ఓట్లు, 2018 ఎన్నికల్లో 1,847 ఓట్ల స్వల్ప తేడాతో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్ధి గాదరి కిషోర్ చేతిలో పరాజయం పాలైయ్యారు. రెండు సార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన అద్దంకి ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ జోష్ మీద ఉండటంతో మూడవ సారి ప్రయత్నంలో ఎలాగైనా ఎమ్మెల్యే గా గెలుస్తామన్న ఆశతో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉండటంతో టికెట్ ఖాయమని భావించారు. అయితే జిల్లాలోని సీనియర్ నేతలు ఆయన ఆశలపై నీళ్లు చల్లారనే టాక్ నడుస్తొంది. అద్దంకి దయాకర్ కు మొండి చేయి ఇవ్వడం వెనుక సీనియర్ నేతలు పెద్ద ఎత్తున కసరత్తు చేశారని సమాచారం.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పని చేసిన శ్యామ్యూల్ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం కృషి చేశారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అభ్యర్ధి గాదరి కిషోర్ విజయం కోసం కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి శ్యామ్యూల్ కి వరించింది. ఆ తర్వాత 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. అయితే రాష్ట్రం లో అన్ని స్థానాల్లో సిట్టింగ్ లకే అవకాశం ఇస్తున్నందున గాదరి కిషోర్ విజయానికి కృషి చేయాలని కేసిఆర్ ఆదేశించడంతో మరల కిషోర్ విజయం కోసం సహకరించారు శామ్యూల్. ఈ సారి ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని శామ్యూల్ ఎదురు చూసినా ఈ సారి కూడా కేసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కన్ఫర్మ్ చేయడంతో శామ్యూల్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యరు. కిషోర్ కుమార్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కోమటి రెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు శామ్యూల్. జిల్లాలో అద్దంకి దయాకర్ కు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే శామ్యేల్ ను కోమటి రెడ్డి పార్టీలోకి చేర్చుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడ్ కాకముందు రాంరెడ్డి దామోదరరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 లో తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన తర్వాత ఆయన సూర్యపేటకు మారారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. సీనియర్ నేత అయిన రాంరెడ్డి దామోదర రెడ్డి మొదటి నుండి అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అద్దంకికి వ్యతిరేకంగా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద అద్దంకి దయాకర్ పేరును ప్రతిపాదించిన సమయంలోనే జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురుంచి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఆగ్రహం తెప్పించాయి. అద్దంకి దయాకర్ పై తమకు ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ సీనియర్ లు అందరూ ఏకపక్షంగా మందుల శామ్యేల్ కు మద్దతుగా నిలిచారు. ఈ కారణంగా శామ్యేల్ కు కాంగ్రెస్ టికెట్ వరించిందని టాక్.
తనకే టికెట్ వస్తుంది, శుక్రవారం నామినేషన్ వేయనున్నాననీ, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని నిన్న పేర్కొన్న అద్దంకి దయాకర్.. కాంగ్రెస్ ప్రకటించిన చివరి జాబితాలో తన పేరు లేకపోయినా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఇవేళ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనను అభిమానించే వారు ఎవరూ ఆందోళన, నిరాశ చెందవద్దని సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని, పార్టీ అభ్యర్ధి శామ్యేల్ నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొంటాననీ, పార్టీ అభ్యర్ధి విజయం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. మందేల సామేల గెలుపునకు సహకరిస్తానని వెల్లడించారు. కార్యకర్తలు ఎవరు పార్టీకి వ్యతిరేఖంగా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని కోరారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, మల్లికార్జున ఖర్గే కి తుంగతుర్తి సీట్ ను గిఫ్ట్ గా ఇస్తానని తెలిపారు అద్దంకి దయాకర్.