Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఏడు రోజుల పాటు రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు విచారించనున్నారు. నిన్న రాత్రి అరెస్టు చేసిన రామచంద్ర పిళ్లైని ఇవేళ ఈడి అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిని అంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారనీ, కేసు దర్యాప్తునకు సహకరించడం లేదనీ, మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరమనీ, ఆయన 25 కోట్ల రూపాయల నేరుగా ట్రాన్స్ఫర్ చేశారని కావున ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ వాదనలు వినిపించింది.

అలానే ఆయన ఇండో స్పిరిట్ లో భాగస్వామిగా ఉన్నారని తెలిపింది. లిక్కర్ పాలసీ కోసం జరిగిన సమావేశాల్లో పిళ్లై పాల్గొన్నారనీ, సమీర్ మహేంద్రుడుతో కలిసి పిళ్లై లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. అరుణ్ పిళ్లే, బుచ్చిబాబుకి సంబంధించి వాట్సాప్ చాట్స్ ఉన్నాయని తెలిపింది. సౌత్ గ్రూప్ చెల్లించిన కిక్ బ్యాక్ అమౌంట్ పంపిణీలో పిళ్లై ప్రధాన పాత్ర పోషించారని, అరుణ్ పిళ్లైతో బుచ్చిబాబును కలిపి విచారించాలని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. అయితే పిళ్లై తరపు న్యాయవాదులు ఈడీ వాదనలను తోసి పుచ్చుతూ 29 రోజుల పాటు పిళ్లైని విచారించారనీ, కానీ సహకరించడం లేదని ఈడీ అధికారులు అంటున్నారని వాదించారు. ఈడీ అడిగిన వాటికి అన్నింటికీ సమాధానాలు ఇచ్చారని తెలిపారు. 29 సార్లు అరుణ్ పిళ్లై విచారణను ఈడీ అధికారులు రికార్డు చేశారని చెప్పారు. పిళ్లైకు థైరాయిడ్, మజిల్ పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఇవ్వాలని కోరారు. అరుణ్ పిళ్లై తల్లి అరోగ్య పరిస్థితి బాగోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం జడ్జి .. వారం రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉండటం గమనార్హం. ఈ స్కామ్ లో అభిషేక్ బోయిన్ పల్లి, సమీర్ మహేంద్రుడు, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తున్నది. వరుస అరెస్టుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత పేరు మరో సారి తెరపైకి వచ్చింది. తదుపరి అరెస్టు కవితేనంటూ ప్రచారం జరుగుతోంది. రామచంద్ర పిళ్లై విచారణ తర్వాత మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని బావిస్తున్నారు.
YSRCP: వైసీపీలో భారీగా పదవుల పందేరం .. అనుబంధ విభాగాలకు 136 మంది జోనల్ ఇన్ చార్జిలు