ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అధికారుల అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడుతోంది. వాహనాలు నడుపుతున్న డ్రైవర్ లు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ పర్యవసానం ఎందరో ప్రయాణీకుల ప్రాణాల మీదకు వస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లు గుండెపోటుతో డ్రైవింగ్ సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం ఆందోళన కల్గిస్తొంది. ఇటీవల గుజరాత్ రాష్ట్రం సవ్ సారీ జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ గుండెపోటుకు గురి కావడంతో బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు 9 మంది మృతి చెందగా, బస్సు ప్రయాణీకులు 30 మంది స్వల్ప గాయాలతో బయటపట్టారు. డ్రైవింగ్ సీటులోనే డ్రైవర్ మృతి చెందాడు.

తాజాగా అటువంటి సంఘటనే నేడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అయితే ఇక్కడ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందినప్పటికీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పింది. పలువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం వద్ద జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన పున్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ప్రైవేటు బస్సులో కాణిపాకం నుండి యాదాద్రి వెళుతుండగా డ్రైవర్ గుండె పోటు కారణంగా డ్రైవింగ్ సీటులో ఒరిగిపోయాడు. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైయ్యారు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దుసుకువెళ్లి ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రయాణీకులు 108కి ఫోన్ చేయగా ఆరోగ్య సిబ్బంది వచ్చి డ్రైవర్ ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.

వాహనాలు నడిపే డ్రైవర్ లు ఆరోగ్యంగా ఉండాలి. డ్రైవర్ లు ఇలా ఒక్క సారిగా అనారోగ్యానికి గురైతే ఆ ప్రభావం ఒక్కో సందర్భంలో తీవ్రంగా ఉంటుంది. బీపీ, షుగర్ ఉన్న డైవర్ లు సమయానికి మందులు వేసుకునే విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. తరచు డ్రైవర్ లకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ ల ఆరోగ్య స్థితిగతులపై రవాణా శాఖ అధికారులు పర్యవేక్షణ జరుపుతుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.