ED Notice To Navdeep: టాలీవుడ్ హీరో నవదీప్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ మదకద్రవ్యాల వినియోగదారుడుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో నవదీప్ ను నార్కోటిక్ బ్యూరో విచారించింది. డ్రగ్స్ కేసు ఆధారంగా ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తొంది. ఈ నెల 10వ తేదీ న విచారణకు హజరుకావాలని నవదీప్ కు ఈడీ నోటీసులో పేర్కొంది.
గత నెల 14వ తేదీన హైదరరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మదాపూర్ పోలీసులతో కలిసి గడిమల్కాపూర్ లో నిర్వహించిన ఆపరేషన్ లో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాడు పట్టుబడిన వారిలో ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు ఉన్నారు. వారి వద్ద నుండి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరిని విచారించే సమయంలో డ్రగ్స్ కొనుగోలు కోసం హీరో నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు అతని స్నేహితుడు రాంచందర్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల నవదీప్ ను పోలీసులు విచారించిన సమయంలో ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అతని సెల్ ఫోన్ లోని డాటాను రికవరీ చేసిన తర్వాత మరో సారి విచారించే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. ఈ క్రమంలో నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే అంతకు ముందు డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు రావడంతో అతను హైకోర్టును ఆశ్రయించగా, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.. సీఆర్పీసీ 41 ఏ కింద విచారణకు హజరు కావాలని నవదీప్ కు ఆదేశించింది. ఆ క్రమంలో పోలీసుల విచారణకు ఇటీవల నవదీప్ హజరైయ్యారు.
ఇక, 2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా సిట్ నవదీప్ ను విచారించింది. ఆ కేసులో నవదీప్ కు ఈడీ రెండు సార్లు నోటీసులు అందజేసినా హజరు కాలేదు. కాగా, ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుండగా, మరో సారి ఈడీ నవదీప్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది.