Gruhalakshmi Scheme Telangana ఆగస్టు 14: గృహలక్ష్మి పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళు కట్టుకునేందుకు సొంత స్థలం ఉన్నవారికి ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏర్పాటుచేసిన పథకం. 4 లక్షలమందికి ఈ పథకం కింద ఇళ్ళు మంజూరు చేయనున్నారు.
119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3 వేల ఇళ్ళ చొప్పున 4 లక్షల ఇళ్ళ నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇవే కాకుండా రాష్ట్ర కోటాలో 43 వేల ఇళ్ళు ఒక్కొక్క ఇంటికి గ్రాంటుగా 3 లక్షల రూపాయలు, ఒక్కొక్క దఫా 1 లక్ష రూపాయల చొప్పున మూడు దఫాలుగా 3 లక్షల రూపాయలను గ్రాంటుగా వారి వారి ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకానికి 2023 బడ్జెట్ లో 12 వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేశారు.

ఈ గృహ లక్ష్మి పధకం లో లబ్ది పొందాలంటే కుటుంబం లోని ఒక మహిళా పేరు మీద మాత్రమే స్థలం ఉండాలి. ఆ మహిళా తెలంగాణా రాష్ట్రం లో నివసిస్తూ ఉండాలి. దరఖాస్తు దారు దళిత , ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి గానీ మైనారిటీ వర్గానికి గాని చెంది ఉండాలి. దరఖాస్తు దారు కు ఆహార భద్రతా కార్డు ఉండాలి.
దరఖాస్తు దారు కు గాని కాంక్రీట్ ఇల్లు ఉంటె వారు అనర్హులు అవుతారు. మహిళ పేరు మీద మాత్రమే ఇల్లు మంజూరు అవుతుంది. ఇళ్ళ మంజూరు గృహలక్ష్మి పథకం అమలుపై సమగ్ర పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించబడింది. ఈ పథకం కోసం వచ్చే దరఖాస్తులను తహసీల్దార్లు, మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రణాళికాశాఖ అధికారులకు అప్పగిస్తారు. దరఖాస్తుదారులైన మహిళల పేరు మీద వాస్తవంగా స్థలం ఉందా? ఎంత విస్తీర్ణంలో ఉంది? అది చట్టబద్ధమైందేనా, రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాలు ఉన్నాయా? దరఖాస్తుదారు సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, ఇది వరకే సొంత ఇల్లు ఉందా..? లేదా అనే విషయాలపై అధికారులు పరిశీలన జరిప కలెక్టర్లకు నివేదికను అందచేయాల్సివుంటుంది. ఆ నివేదికలను కలెక్టర్లు పరిశీలించిన తరువాత పథకాన్ని మంజూరు చేస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ రెండూ విడివిడిగా కొనసాగుతాయి .
గృహ లక్ష్మీ పథకం దరఖాస్తు దారుకు తెల్ల రేషన్ కార్డు తో పా టు ఓటర్, లేదా ఆధార్ కార్డు ఉండాలి , సొంత ఇంటి స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే వారికి గృహ లక్ష్మి పథకం కింద ఎంపిక చేయడం జరుగుతుంది .

జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3 వేల ఇండ్ల చోప్పున గృహలక్ష్మి కింద ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు సకాలంలో గృహాలు నిర్మించుకోనేల మండల స్థాయి అధికారులు, పి.ఆర్. ఏ.ఈ లు చూస్తారు అలాగే మండల నోడల్ అధికారులుగా తహశీల్దార్లు వ్యవహరిస్తారు . అదేవిదంగా లబ్ధిదారులకు ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీ గా జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్లు వ్యవహ రిస్తారు .
గృహలక్ష్మి పథకం లో భాగంగా లబ్ధిదారులకు 3 విడతల్లో లక్ష రూపాయల మొత్తం 3 లక్షల ఆర్థిక సహాయం మొదటగా ఫౌండేషన్ దశలో లక్ష రూపాయలు, రూఫ్ నిర్మించిన తరువాత లక్ష రూపాయలు అలాగే ఇంటి నిర్మాణం తరువాత లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని కలెక్టర్ వివరించారు. లబ్ధిదారుల గృహ నిర్మాణాలు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని ఇండ్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో అప్ లోడ్ చేస్తే లబ్ధిదారుల ఖాతాలో త్వరగా జమ అవుతాయని స్పష్టం చేశారు.
దరఖాస్తు దారు ఈ క్రింది వాటిని సమర్పించాలి
1. నివాస ధ్రువ పత్రము
2. ఆధార్ కాపీ
3. ఇటీవలి ఫోటోలు
4. బ్యాంకు వివరాలు
5. రేషన్ కార్డు
6. ఫోన్ నెంబర్
7. కుల ధ్రువీకరణ పత్రము
దరఖాస్తు లను గ్రామ సభ , మున్సిపల్ ఆఫీస్ , మండల్ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ లలో పొంద వచ్చును. జాగ్రత్తగా చదివి నింపి అధికారులకు అందచేయాలి.
ప్రభుత్వం రూపొందించిన గృహలక్ష్మి పథకం నిలువ నీడ లేని ఎంతో మంది నిరు పేదల కోసం ఉద్దేశించబడింది , కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
పథకం లో ముఖ్యమైన పాయింట్ గృహ లక్ష్మి పథకం కింద లబ్ది పొందాలి అంటే ముందు ఆ లబ్ది దారుడి పేరిట హౌస్ సైట్ అనేది ఉండాలి. కానీ గ్రామాల్లో నివాస భూముల్లో రక రకాలు ఉంటాయి
1) అబాది లేదా గ్రామకంఠం భూములు వీటికి సర్వే నంబర్లు ఉండవు తాత ముత్తతల నుండి ఈ భూముల్లో ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్నారు గ్రామాల్లో మెజారిటీ ఈ రకమే నివాస భూములు
2) ముందు వ్యవసాయ భూముల కింద ఉండి తరువాత వ్యవసాయేతర భూములుగా మార్చుకుని నివాసం ఉంటున్న ఇళ్ళు
3) ప్రభుత్వం ద్వారా గతంలో మంజూరు చేయబడిన అసైన్డ్ భూములు
గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్లు… తాతల పేర్ల మీద ఉంటాయి. ఇవి శిథిలం అవడంతో వారసులు వేరే చోట కిరాయికి ఉండడమో లేదా శిథిలం అయినా ఇళ్లనే కొంచం రిపేర్ చేసుకుంటూ నివాసం ఉండడమో లేదా ఆ శిథిలం అయినా ఇళ్లను మొత్తం తొలగించి అదే ప్లేస్ లో గుడిసెలు వేసుకుని నివాసం ఉండే వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఆ శిథిలమైన ఇంట్లోనో లేదా ఆ జాగాలో బతికే ఆ ఇంటి వారసుడి పేరిట ఆ జాగా ఉండదు, వాళ్ల తాత ముత్తాతల పేరుపై మీదో లేదా వాళ్ల తల్లిదండ్రుల పేరు మీదో రికార్డుల్లో ఉంటుంది. ఆ ఇంటి యజమానులు బతికి ఉండరు కాబట్టి వారి కుమారులో, మనవలో వారసత్వంగా ఆ భూమిని అనుభవిస్తూ వస్తుంటారు.
ఆ ఇళ్లను లేదా ఖాళీ స్థలాలను వారసులు వాళ్ల పేర్ల మీద మార్చుకుని దరఖాస్తు చేసుకోవచ్చు కదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ అది అంత సులభం కాదు, చనిపోయిన తాత ముత్తాతల పేర్ల లేదా చనిపోయిన తల్లిదండ్రుల పేర్ల మీద ఉన్న ఇళ్లను గ్రామపంచాయతీలో మార్చుకోవాలి అంటే చనిపోయిన వారికి ఒక్కరే వారసుడు ఉండాలి. ఆ చనిపోయిన వారికి మరణ సర్టిఫికెట్ ఉండాలి వాళ్లు చనిపోయిన వారి వారసులే అని కుటుంబ సభ్యులు చే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉండాలి. తాత ముత్తాతల మరణ సర్టిఫికెట్స్ చాలా మంది తీసుకుని ఉండరు, ఎప్పుడో చనిపోయిన వాళ్ల డెత్ సర్టిఫికెట్స్ కావాలంటే నేరుగా గ్రామపంచాయతీ నుంచి తీసుకోరాదని ఆర్డీవో ప్రొసీడింగ్ ఉండాలి. చాలా జిల్లాల్లో ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడంలేదు. ఒకవేళ డెత్ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను చనిపోయిన వారి బ్యాక్ ఖాతాలో డబ్బులు ఉంటే వాటి పర్పస్ కోసమే ఇస్తున్నారు. ఈ రెండు లేకుండా ఆ ఇంటి మార్పిడి సాధ్యం కాదు కాబట్టి ఇది ప్రధాన సమస్యగా ఉంది.
Telangan Related: టీఎస్పీఎస్సీ గ్రూప్ – 2 పరీక్ష వాయిదా
భూ పంచాయితీలు
చనిపోయిన తాత ముత్తాతల పేర్లపై లేదా చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉంటే వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారనుకుందాం. వీళ్లు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటారు. ఒకరి ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఊర్లో ఉన్న స్థలం నివాసం ఉంటున్నారు అనుకుందాం. సాధారణంగా ఈ ఇంటి స్థలంపై పంచాయితీలు ఉంటాయి. ఇప్పుడు గృహలక్ష్మి పథకం వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు వారసులు స్థలం మాదంటే మాదని కొట్లాటలు షురూ అవుతున్నాయి. తాత ముత్తాతలకు గ్రామ కంఠం భూముల్లో ఒక ఐదు గుంటలు ఉంటే అందులో రెండు గుంటల్లో ఇళ్లు కడతారు, ఆ రెండు గుంటలు మాత్రమే రికార్డుల్లో వాళ్ల పేర్లు ఉంటాయి, మిగతా మూడు గుంటలు ఎవరి పేరు మీద ఉంటే, వారసత్వంగా ఆ మూడు గుంటల ఖాళీ స్థలాన్ని వారసులు అనుభవిస్తూ వస్తుంటారు. ఎటువంటి రికార్డులు లేని ఆ మూడు గుంటల్లో ఇళ్లు లేని ఆ వారసుల్లో ఒకరు గృహ లక్ష్మి పథకం కింద ఇళ్ళు కట్టాలి అంటే ఎలా?
నిబంధనలు సడలించాలని పోస్టులు
పంచాయతీ, వ్యవసాయేతర భూములు గ్రామాల్లో చాలా మంది ఎప్పుడో సాదా బైనామా కింద కొనుక్కుని రిజిస్ట్రేషన్ లేకుండా గుడిసెలో వేసుకున్నారు. వాటిలో చాలా వరకు గ్రామ పంచాయతీ రికార్డులో వాళ్లు నిర్మించుకున్న రేకుల ఇళ్లు గుడిసెలు కూడా శిథిలమై ఉంటాయి. ఆ నిర్మాణాలు గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఉండవు కాబట్టి నిజానికి వారికి కూడా పక్కా గృహాలు అవసరం కానీ గృహలక్ష్మి పథకం ద్వారా వాళ్లు లబ్దిపొందలేని పరిస్థితి నెలకొంది. ఇంకో జనరల్ సమస్య సొంత జాగా ఉండి మూడు లక్షలు పొందాలి అంటే చాలా మంది ఇళ్లు కట్టక ముందే పైసలు ఇస్తారు కావచ్చు పైసలు వచ్చాక ఇంటి పనులు మొదలు పెడదాం అనుకుంటున్నారు. కానీ స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం మూడు లక్షలు పొందాలంటే ముందు ఎక్కడైనా అప్పు తెచ్చుకుని బెస్మెంట్ కడితే ఆ స్టేజ్ లో లక్ష తరువాత స్లాబ్ పడ్డ స్టేజ్ లో మరో లక్ష ఇళ్లు మొత్తం పూర్తి అయ్యాక ఇంకో లక్ష ఇస్తారని చెప్పారు. ఇన్ని అడ్డంకులు దాటుకుని ఇళ్లు కట్టాలంటే అప్పు తెచ్చుకుని పని మొదలు పెట్టాలి కానీ చాలా మంది ఆర్థిక పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు వెళ్లువెత్తున్నాయి. గృహలక్ష్మి పథకం ద్వారా అసలైన అర్హులు లబ్ది పొందాలంటే నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు కూడా ఈ పధకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది . ఐదు శాతం ఇళ్లను దివ్యానుగులకు కేటాయించారు. పేదలకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే ఇంకా ఏంటో మందికి లాభం చేకూరుతుందని ప్రజలు అంటున్నారు.