Huzurabad By Poll: హుజూరాబాద్‌లో రాజకీయం రోజురోజు వేడెక్కుతోంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో ఉప ఎన్నిక జరగనున్నది. బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేయడం కన్ఫర్మ్ అన్నది తెలిసిందే. ఇప్పటికే ఈటలతో పాటు బీజేపీ నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా ఈటలను దెబ్బతీయాలన్న కృత నిశ్చయంతో సమర్థవంతమైన అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనలో అధికార టీఆర్ఎస్ ఉంది. ఉప ఎన్నికల తేదీ ఖరారు కాకపోయినా నియోజకవర్గంలో ఇప్పటికే హోరాహోరీ సభలు ప్రచారాలు ప్రారంభించిన పార్టీలు తమదైన శైలిలో ముందుకు వెళుతూ ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు.

Read More: BJP: బీజేపీ జాతీయ కమిటీలో భారీ మార్పులకు కసరత్తు..! అయిదు రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యం..!!
నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలపై పోటీకి దింపేందుకే టీఆర్ఎస్ ఆహ్వానం పలికిందని వార్తలు వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీసీ, దళిత సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈటల ముదిరాజ్ (బీసీ) సామాజిక వర్గ నేత. ఇక్కడ అగ్రవర్ణ నేతలను పోటీకి నిలబెడితే ఈటల గెలుపు నల్లేరుపై నడక అవుతుంది. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతను నిలపాలన్న ఆలోచనతో గులాబీ బాస్ పద్మశాలి (బీసీ) సామాజిక వర్గానికి చెందిన ఎల్ రమణను రంగంలోకి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరనున్నారు.
ఈ ప్రచారం ఇలా ఉండగా తాజాగా కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఆడియో టేప్ లీక్ కావడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ టికెట్ తనదేనంటూ ఓ కార్యకర్తతో కౌశిక్ రెడ్డి మాట్లాడటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ పరిణామాల క్రమంలో కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేయడం, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. ఇదే సందర్భంలో కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై పరాజయం పాలైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 70 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. కౌశిక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఎల్ రమణకా, కౌశిక్ రెడ్డికా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.
కాంగ్రెస్ పార్టీ తరపున పొన్నం ప్రభాకర్ ను దించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. టీజెఎస్ నుండి అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరామ్ తెలియజేశారు. ఇక వైఎస్ఆర్ టీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది ఇంత వరకూ స్పష్టత లేదు. ఇంత వరకూ గ్రామ, మండల స్థాయిలో వైఎస్ఆర్ టీపీ కమిటీల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతానికి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీజెఎస్ చదుర్ముఖ పోటీ ఖాయంగా కనబడుతోంది.