Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ, తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14వ తేదీ నుండి వారాహి యాత్రకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సోమవారం యజ్ఞం నిర్వహించారు. మరో పక్క తెలంగాణ జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమైయ్యారు. తెలంగాణలో 26 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ చార్జ్ లను నియమించారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గ ఇన్ చార్జిలకు నియామక పత్రాలను పవన్ కళ్యాణ్ అందించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని అన్నారు. ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారన్నారు. వాళ్ల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజనమన్నారు. తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసేన ఆకాంక్ష అని అన్నారు.

ఏ రాజకీయ పార్టీలోనూ ఇంత మంది కొత్త వారికి అవకాశం ఇవ్వదన్నారు. అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరూ సమర్ధవంతంగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. లీడర్స్ గా ప్రతి ఒక్కరూ ఎదగాలనీ, ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. కుదిరితే పొత్తుతో ఎన్నికలకు వెళ్దాం లేకుంటే ఒంటరిగా ఎలా పోటీ చేయాలో తాను చెబుతానని అన్నారు. తెలంగాణలోనూ వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు.
Janasena: జనసేనలో చేరిన టాలీవుడ్ బడా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్