Pawan Kalyan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పని చేస్తారు తప్ప ఎన్నికల ప్రయోజనాల కోసం కాదని అన్నారు. మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తే ఆర్టికల్ 370, పెద్ద నోట్ల రద్దు చేసే వారు కాదు, రామమందిరం నిర్మించే వారు కాదని అన్నారు. ప్రతి భారతీయుడు గుండెల్లో ప్రధాని మోడీ ధైర్యం నింపారని కొనియాడారు.
మోడీ నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలని ఆకాంక్షించారు. తన లాంటి కోట్ల మంది కలల ప్రతిరూపమే నరేంద్ర మోడీ అని అన్నారు. మోడీ మరో సారి ప్రధాని కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్ద గలిగే సత్తా ఉన్న నాయకుడు మోడీ అని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశ అంతర్గత భద్రత కు అధిక ప్రాధాన్యత ఇచ్చి తీవ్రవాద మూకలను ఎలా కట్టడి చేశారో దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. శత్రుదేశాలు మన దేశం మీద ఏ విధంగా దాడులకు వచ్చినా, మేం ఖచ్చితంగా మీ దేశం మీద అంతే బలంగా దాడి చేస్తాం అనేలా హెచ్చరికలు పంపిన గొప్ప నాయకత్వం దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిందన్నారు.
మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కూడా పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. జల్ జీవన్ మిషన్, గరీబ్ కళ్యాణ్ యోజన, భారత్ ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు భారతీయుల జీవన ప్రమాణ స్థాయిని పెంచాయని అన్నారు. కరోనా క్లిష్ట సమయంలో దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా టీకాలు పంపిణీ చేసిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాన్ని గుర్తించిందన్నారు. మహిళా సాధికారత విషయంలోనూ కేంద్రం తీసుకొచ్చిన మార్పులు అమూల్యమని అన్నారు. ఇతర దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు నెలకొల్పే విషయంలో గానీ, దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకునే విషయంలో, ఫారన్ పాలసీని అద్భుతంగా తీర్చిదిద్దుకునే విషయంలో కానీ మోడీ నాయకత్వంలో దేశం అద్భుతమైన ముందడుగు వేసిందని కొనియాడారు.
తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో నిత్యం ఎన్నికల వాతావరణమే కనిపిస్తొందని అన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయ వాతావరణమే అభివృద్ధికి విఘాతంగా మారుతందన్నారు. అయిదు సంవత్సరాలకు ఒక సారి ఎన్నికలు అన్నట్లు ఉండాలి తప్ప .. అయిదేళ్లు ఎన్నికలే అన్నట్లు వాతావరణం ఉండకూడదన్నారు. ఇలాంటి వాతావరణంలో ఘర్షణ, అవినీతి పెరిగిపోతాయి తప్ప ప్రజలకు మేలు జరగదని అన్నారు. దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ పాలన దక్షత దేశానికి దశదిశ ను చూపిందన్నారు. దేశం కోసం నిత్యం ఆలోచించే మోడీ లాంటి నాయకులతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంత నాయకులు ఎంతగా సయోధ్య కుదుర్చుకొని, రెండు తెలుగు రాష్ట్రాలను మరింతగా ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో ఆలోచించాలన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ చేరాలన్న ఆకాంక్షతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకు వస్తేనే తెలంగాణ ఏర్పడిందన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇవన్నీ తెలంగాణ ప్రజలకు చేరాయా అన్నది ఆలోచించాలన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడమే ఎజెండాగా పని చేస్తున్న బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో జనసేన సంపూర్ణ సహకారం అందిస్తొందని పవన్ తెలిపారు. దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న నరేంద్ర మోడీకి అందరూ అండగా నిలవాలన్నారు.
PM Modi: కేసిఆర్ సర్కార్ పై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్