ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసిఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న భద్రతను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు 3 ప్లస్ 3 పోలీస్ భద్రత ఉండగా, దాన్ని 2 ప్లస్ 2 కి తగ్గించింది. దీంతో పాటు ఆయనకు ఎస్కార్ట్ ను, నివాసం వద్ద ఉండే గన్ మెన్ లను కూడా తొలగించింది. ఈ అంశం ఖమ్మం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పొంగులేటి గత కొంత కాలంగా సొంత పార్టీ బీఆర్ఎస్ పైనే పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జనవరి 1వ తేదీన పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం నిర్వహించిన పొంగులేటి.. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

ఈ సారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్ధిత్వాల ఖరారు పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటాయి. అయితే పార్టీ అధిష్టానంతో మాట్లాడి తన అనుచరులకు కూడా అభ్యర్ధిత్వాలు ఖరారు అయ్యేలా ప్రయత్నిస్తాను అనాల్సింది పోయి తనతో పాటు తన అనుచరులు కూడా పోటీ చేస్తారు అని ప్రకటించడం, అంతకు ముందు కూడా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం పొంగులేటిపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పొంగులేటి భద్రత తగ్గించడం ఖమ్మం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి వివిధ హోదాల్లో పని చేశారు. 2013లో వైసీపీ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కొంత కాలం పని చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఖమ్మం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు పై విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ టికెట్ ఆశించినా పార్టీ అధిష్టానం నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతో ఆయన గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత ఆయనకు పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఏ పదవీ రాలేదు. ఆ నేపథ్యంలో పొంగులేటి పార్టీ మారతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయితే ఆ ప్రచారాన్ని పొంగులేటి ఖండించారు. పార్టీలోనే కొనసాగారు.
అయితే జనవరి 1వ తేదీన భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయం కోసం కృషి చేశారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక అనుచరవర్గం, అభిమానులు కల్గి ఉండటంతో పొంగులేటి రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలి.
మాణిక్యం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు థాకరే..రేవంత్ పదవి సేఫ్(యేనా?)