Telangana Assembly Polls: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ లు తగులుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు బీఆర్ఎస్ కు బైబై చెప్పారు. వేనేపల్లితో పాటు ముగ్గురు ఎంపీపీలు, ముగ్గురు జడ్పీటీసీ సభ్యులు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్ లు మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్యయ్య యాదవ్ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని వీరు శపథం చేశారు. రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ నేతలు ప్రకటించారు.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరంకుశంగా వ్యవహరించారనీ, సొంత పార్టీ నాయకులపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం దారుణమన్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపు కోసం తామంతా కలిసి పని చేస్తామని వారు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సహా మూడు మండలాలకు చెందిన పలువురు కీలక నాయకులు రాజీనామా చేయడం కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ లో ఓ కుదుపుగా భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వేనేపల్లి చందర్ రావు .. కోదాడ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఓటమి పాలైయ్యారు. టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన చందర్ రావు 1985 నుండి వరుసగా మూడు పర్యాయాలు 1985,89, 1994 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1999,2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో చందర్ రావు ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత తిరిగి 2009 లో ఎన్నికల్లో నాల్గోవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు చందర్ రావు. రాష్ట్ర విభజన తర్వాత చందర్ రావు 2014లో చందర్ రావు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2014 టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన బొల్లం మల్లయ్య యాదవ్ కు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుండి పోటీ చేసి కేవలం 756 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఈ సారి ఎన్నికల్లో చందర్ రావు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న చందర్ రావు మూడు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో చందర్ రావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఉత్తంకుమార్ రెడ్డి. శనివారం నియోజకవర్గంలోని తన అనుచరవర్గంతో సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే చందర్ రావు..ఎమ్మెల్యే పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమే తమ లక్ష్యం గా శపథం చేశారు.
ఆదివారం ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు. ఉత్తంకుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. పద్మావతి రెడ్డి గెలుపునకు చందర్ రావు, ఆయన అనుచర వర్గం పని చేయనున్నది.
Pawan Kalyan: అధికార ప్రతినిధులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలు ఇవి