తెలంగాణలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో మరో విషాదకర ఘటన వెలుగుచూడటం తీవ్ర కలకలాన్ని రేపింది. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు దాసరి హర్షగా గుర్తించారు. అతని స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం చింతగూడ గ్రామం.

హర్ష శుక్రవారం ఓ పరీక్ష రాయాల్సి ఉండగా, హాస్టల్ లోనే ఉండిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితులు వచ్చి చూడగా.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించారు. దీంతో వెంటనే వారు సిబ్బందికి సమాచారం అందించారు. అయితే విద్యార్ధి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్ష బాగా చదువుతాడనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు విచారణలో హర్ష ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషయంగానే..
ఇదిలా ఉండగా, సీనియర్ విద్యార్ధి వేధింపుల కారణంగా నాలుగు రోజుల క్రితం పాయిజన్ ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన వరంగల్లు కేఎంసీ పీడీ ఫస్టియర్ విద్యార్ధిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రీతికి వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ తో వైద్యం అందిస్తున్నారు. మరో పక్క ప్రీతి ఆత్మహత్యయత్నం వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఉన్నతాధికారులకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ప్రీతి ఆత్మహత్యాయత్నంకు కారణంగా భావిస్తున్న సీనియర్ విద్యార్ధి సైఫ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టాడనీ, వాట్సాప్ గ్రూపుల్లో అవమానకరంగా మాట్లాడాడని తమ విచారణలో తేలినట్లుగా పోలీసులు వెల్లడించారు.