ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ కోసం హజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ జారీ చేసిన నోటీసులపై కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. పదవ తేదీన మహిళ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన నేపథ్యంలోనే తనకు నోటీసులు జారీ అయ్యాయని అన్నారు. రేపు విచారణకు హజరు కావాలని తనకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల నోటీసులు జారీ చేశారనీ, తెలంగాణ ఇటువంటి నోటీసులకు తలవంచదు అని కవిత పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని తెలియజేసిన ఆమె.. ఢిల్లీలో ధర్నా, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల రేపు విచారణకు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదించనున్నట్లు తెలిపారు.

ఈడీ నోటీసులకు తాను భయపడబోననీ, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. ఈడీ నోటీసులపై తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసిఆర్ తో చర్చించేందుకు కవిత ప్రగతిభవన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నాయి. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణ సంస్థలను వాడుకుంటోందని విమర్శించారు. మరో వైపు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఇటీవల ఈడీ అరెస్టు చేసిన ప్రముఖ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీనంటూ అంగీకరించిన నేపథ్యంలో..ఆయనతో కలిపి కవితను విచారించాలని ఈడీ భావిస్తున్నది. రామచంద్ర పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఏడు రోజుల పాటు రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులు తెలిపిన వాంగ్మూలం ఆధారంగా కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.
Political Survey: బాబు ఇలాకాలో జగన్ హవా .. తాజాగా వచ్చిన సర్వేలోనూ అదే లెక్క..!