Suicide: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లిలోని తామెర చెరువులో ఈ ఘటన జరిగింది. ముగ్గురి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ కు చెందిన తల్లి మృదుల (40), ఆమె కుమారులు ప్రజ్ఞాన్ (8), మహాన్ (5) లు గుర్తించారు.

కుటుంబ కలహాలే కారణమని బంధువులు పేర్కొంటున్నారు. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచి వేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే పెద్దల పంచాయతీ పెట్టుకుని పరిష్కరించుకోవాలే కానీ ఇలా అన్నెం పుణ్యం తెలియని ఇద్దరు చిన్నారులను బలి తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఎన్టీఆర్ నగర్ లో విషాదశ్చాయలు అలుముకున్నాయి.