KA Paul: మునుగోడు ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన దైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగుతాన్న ప్రజాగాయకుడు గద్దర్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో కేేేఏ పాల్ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ప్రజాశాంతి పార్టీ గుర్తింపును ఈసీ రద్దు చేయడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. తనను గెలిపిస్తే ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తా, యువతకు ఉద్యోగాలు, మండల కేంద్రాల్లో కార్పోరేట్ స్థాయి ఆసుపత్రులు కట్టిస్తా ఇలా ఆచరణ సాధ్యం హామీలను ప్రజలకు ఇస్తూ హస్యాన్ని పండిస్తున్నారు కేఏ పాల్.

ఆయన మాటలు, చేష్టలతో ఆయన్ను అందరూ కమెడియన్ గా చూస్తూ ఆనందిస్తున్నారు. ఇప్పటి వరకూ తన మాటలు, ప్రసంగాలతో నవ్వులు పూయించిన కేఏ పాల్ తాజాగా .. నడి రోడ్డుపై ఓ ఫోక్ సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గుమికూడగా, తన హావభావాలతో పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసి వినోదాన్ని పంచారు. కేేేఏ పాల్ డ్యాన్స్ చేస్తుంటే చుట్టూ చేరిన పలువురు యువకులు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేసుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓట్ల సంగతి ఏమో గానీ సోషల్ మీడియాలో మాత్రం కేఏ పాల్ వీడియోకు వేల సంఖ్యలోనే వ్యూస్ వస్తున్నాయి. నియోజకవర్గంలో కార్యకర్తల బలం, మండల, గ్రామ స్థాయిలో నాయకులు లేకపోయినా వార్ ఒన్ సైడే, ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్ధులు తనకు పోటీయే కాదు, గెలిచేది తానే, 20 మందికిపైగా స్వతంత్ర అభ్యర్ధులు తనకు మద్దతు ఇస్తున్నారు అని కేఏ పాల్ ప్రచారం చేసుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.