పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆమెకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఆమె తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. షర్మిల బెయిల్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. దీంతో సోమవారం రాత్రే షర్మిలను చంచల్ గూడ జైలుకు తరలించారు.

టీఎస్పీఎస్సీ దర్యాప్తుపై సిట్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని షర్మిల నిర్ణయించుకుని లోటస్ పాండ్ లోని తన నివాసం నుండి బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులపై షర్మిల దురుసుగా వ్యవహరించారు. ఆ సమయంలో బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనం ఎక్కించి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ క్రమంలో పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పోలీసులపై షర్మిల వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. పలు సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1 గా షర్మిల, ఏ 2గా షర్మిల డ్రైవర్ బాబు, ఏ 3 గా యాకబ్ ను పోలీసులు చేర్చారు. నిందితుడు యాకబ్ పరారీలో ఉన్నాడు. షర్మిల అరెస్టు విషయం తెలిసి ఆమె తల్లి విజయమ్మ పీఎస్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయమ్మను పోలీస్ స్టేషన్ లోకి అనుమతించలేదు. పోలీసులతో విజయమ్మ వాగ్వివాదానికి దిగారు. ఓ మహిళా పోలీసు పై చేయి కూడా చేసుకున్నారు. పోలీసులతో షర్మిల, విజయమ్మ ప్రవర్తించిన తీరు పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జూబ్లిహిల్స్ పీఎస్ ఉన్న షర్మిలను ఆమె భర్త అనిల్ పరామర్శించారు.
Breaking: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి బిగ్ షాక్..