ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రాజకీయ నేతల పేర్లే కాకుండా కొత్త కొత్త వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో బాల మేధావిగా అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సైంటిస్ట్ పేరు వెలుగులోకి రావడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో నిధుల మళ్లింపుపై ఈడీ చార్జి షీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

దుబాయ్ కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిదులు మళ్లింపు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. దీంతో ఫై కంపెనీ వ్యవస్థాపకుడైన సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ గొరకవి (33) పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. ప్రవీణ్ గొరకవి .. సీఏ బుచ్చిబాబుకు సన్నిహితుడని తేలింది. ఈ కుంభకోణంలోని నిధులను హవాలా రూపంలో ప్రవీణ్ కుమార్ కంపెనీకి మళ్లించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. గతంలో కాచిగూడలోని ప్రవీణ్ కుమార్ నివాసంపై ఈడీ సోదాలు జరిపిన సమయంలో రూ.24 లక్షలు స్వాధీనం చేసుకుంది.

ప్రవీణ్ కుమార్ పలు ఆవిష్కరణలు చేసి బాల మేధావిగా గుర్తింపు పొందారు. గతంలో ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా అవార్డు, అభినందనలు సైతం అందుకున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రవీణ్ కుమార్ పేరు వెలుగులోకి రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో పలువురు నిందితులకు ఢిల్లీ కోర్టు రీసెంట్ గా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, రాజకీయ నాయకుల సంబంధీకులు అభియోగాలను ఎదుర్కొంటుండటం తీవ్ర సంచలనం అయ్యింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె కవితను ఇటీవలే అధికారులు విచారించారు.
తెలంగాణలో మరో సారి ఐటీ రైడ్స్ కలకలం.. ఈ సారి ఎవరి వంతు అంటే..?