Telangana Elections: తెలంగాణలో ప్రధాన రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రచార పర్వంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేసిఆర్ ప్రభుత్వ పాలన తీరును విమర్శించేలా వినూత్న రీతిలో ప్రజలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ గూలాబీ రంగులో ఒ అంబాజిడర్ కారు, ఓ ఏటీఎం కార్డు నమూనా సిద్దం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఓ ఏటీఎం కార్డు నమూనాను సిద్దం చేశారు.
ఈ ఏటీఎం మిషన్ లో కార్డు పెడితే కేసిఆర్ నోట్లో నుండి కరెన్సీ నోట్లు వస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తయారు చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ సర్కార్ లో స్కామ్ లు జరిగాయంటూ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కారుకు పూర్తిగా గులాబి రంగు వేయించి 111 జీవో, ధరణి, బొగ్గు కుంభకోణం తదితర ప్రభుత్వ వైఫల్యాల స్లోగన్ లు దానిపై ముద్రించారు. కారు నెంబర్ ప్లేట్ పై కేసిఆర్ 420 అని రాయించారు.
ఈ రెండింటినీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారంలో వాడుకుంటోంది. శనివారం ప్రచారం ముగిసిన తర్వాత ఆ కారు. ఏటీఎం మిషన్ లను గాంధీ భవన్ ఆవరణలో పెట్టారు కాంగ్రెస్ నేతలు. సిబ్బంది అంతా వెళ్లిపోయిన తర్వాత పోలీసులు ట్రాఫిక్ బోయింగ్ వ్యాన్ తో గాంధీ భవన్ కు చేరుకుని కారుతో పాటు ఏటీఎం మిషన్ ను అక్కడ నుండి తరలించారు. ఈ సమయంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అక్కడ నుండి తరిమివేశారు.
అనంతరం వాటిని గోషమహల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. పోలీసులు గాంధీ భవన్ ఆవరణలో చొరబడి దౌర్జన్యంగా కారు, ఏటీఎం మిషన్లను తరలించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కారు. ఏటీఎంలను గాంధీ భవన్ కు తీసుకువచ్చి అప్పగించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆ పార్టీ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.