BTech Ravi: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి ని మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుండి పులివెందులకు వస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బీటెక్ రవిని ఎక్కడకు తీసుకువెళ్లిందీ తెలియట్లేదని టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కేసులో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే దానిపై కూడా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు.
గన్ మెన్లు, డ్రైవర్ ను వదిలివేసి బీటెక్ రవిని వల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు తెలుస్తొంది. అయితే రవిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా దృవీకరించలేదు. రవిని పోలీసులే కిడ్నాప్ చేశారని, అతనికి ఏమి జరిగినా పోలీసులదే బాధ్యత అని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు దృవీకరించని నేపథ్యంలో ఈ ఘటనపై కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తొంది.