Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన రాజాసింగ్ ..మూడో సారి కూడా విజయం సాధించి హాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన తన సొంత పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతలే తన వెనుక గోతులు తవ్వుతున్నారని మండిపడ్డారు. తన వ్యూహాలను సొంత మనుషులే ప్రత్యర్ధులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత వీరి అంతు చూస్తానని హెచ్చరించారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు యత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని అన్నారు. తమ ప్రత్యర్ధులతో ఎవరెవరు టచ్ లో ఉన్నారనే విషయం కూడా తనకు తెలుసునని చెప్పారు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు.

2018 ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఏకైన నేతగా నిలిచారు రాజాసింగ్. 2009 లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాజాసింగ్ .. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి కార్పోరేటర్ గా గెలిచారు. 2000 నుండి 2014 వరకూ కార్పోరేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరి 2014 ఎన్నికలో గోషామహల్ నుండి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ధి ముకేష్ గౌడ్ పై దాదాపు 46వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 2018 లో టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రేమ్ సింగ్ రాథోర్ పై 17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ తో విజయం సాధించి రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు.
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై గత ఏడాది ఆగస్టు 23న బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది. అదే క్రమంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు శాసనసభా పక్ష పదవి నుండి తొలగించి ఆయనపై చర్యలు తీసుకుంది. అయితే శాసనసభ ఎన్నికల సందర్భంగా గత నెల 22వ తేదీన బీజేపీ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్ధుల మొదటి జాబితాలోనే గోషామహల్ నుండి రాజాసింగ్ పేరును ప్రకటించింది. దీంతో నియోజకవర్గం నుండి మూడో సారి బరిలో నిలిచారు రాజా సింగ్. రాజాసింగ్ కు ప్రత్యర్ధులుగా బీఆర్ఎస్ నుండి నంద్ కిషోర్ వ్యాస్, కాంగ్రెస్ అభ్యర్ధిగా మొగిలి సునీత బరిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
Telangana BJP: వరుస వలసలు .. బీజేపీ స్వయంకృతాభిరాధమే(గా)..!