Revanth Reddy: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని నాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతలు స్పీకర్ ను కలిసి పార్టీ ఫిరాయింపుదారులపై వేటు వేయాలని విజ్ఞప్తి కూడా చేశారు. అయితే సాంకేతిక అంశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోలేదు. అయితే పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన రేవంత్ రెడ్డి తాజాగా ఆ విషయంపై మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీ లోకి వెళ్లిన నేతలపై రేవంత్ మండిపడ్డారు. అలాంటి నాయకులను గెలిపించిన ప్రజలు రాళ్లతో కొట్టాలన్నారు. తమ పార్టీని వీడి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలను రద్దయ్యేంత వరకూ పోరాటం చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. ఇతర పార్టీలకు వెళ్లిన ఎమ్మెల్యేలకు నైతికత ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని పేర్కొన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడు పోయారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన రోజు నుండి రేవంత్ రెడ్డి రోజు పార్టీ సీనియర్ నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదటి నుండి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడానికి వీలులేదంటూ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించడంతో అందరినీ కలుపుకుపోయేందుకు ప్రతి రోజు కొందరు నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం మాణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను రేవంత్ రెడ్డి కలిశారు. ఆ తరువాత రేణుకా చౌదరి నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమైయ్యారు.