Revanth Reddy vs Malla Reddy: మంత్రి మల్లారెడ్డి అక్రమాల భారీ చిట్టా బయటపెట్టిన రేవంత్ రెడ్డి..! కానీ చివర్లో ఒక ట్విస్టు..!?

Share

Revanth Reddy vs Malla Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రాజీనామా చేసి తనపై పోటీకి సిద్ధపడాలంటూ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మల్లారెడ్డి అక్రమాల చిట్టా విప్పారు. మంత్రి మల్లారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి కొన్ని విషయాలకు సంబంధించి మీడియా సమావేశంలో ఆధారాలను చూపారు. వీటిపై విచారణ చేయడానికి సీఎం కేసిఆర్ సిద్దమా అని ప్రశ్నించారు. గతంలో కేసిఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు వస్తే తన కొడుకైనా, కూతురు అయినా జైలుకు వెళ్లాల్సిందే అని మాట్లాడారని గుర్తు చేస్తూ  మొదటి మంత్రి వర్గంలో దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై, ఇప్పుడు ఈటల రాజేందర్ పై వేటు వేసిన కేసిఆర్ మల్లారెడ్డి అవినీతి కనబడటం లేదా అని ప్రశ్నించారు. పెద్ద దొంగను పక్కన పెట్టుకుని కేసిఆర్ ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మల్లారెడ్డిపై గత కొద్ది రోజులుగా తాను నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని ఇప్పుడు వాటిలో కొన్నింటికి సంబంధించి ఆధారాలు చూపుతున్నానన్నారు.

Revanth Reddy serious allegations on Malla Reddy
Revanth Reddy serious allegations on Malla Reddy

Read more: Justice NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ చూడాల్సిన చరితలు చాలా ఉన్నయ్..! మార్చాల్సిన వ్యవస్థలు వేరే ఉన్నయ్..!!

Revanth Reddy vs Malla Reddy: 22 ఎకరాలు 33 ఏలా అయ్యింది

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఆడియో కూడా బయటకు వచ్చిందన్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీ తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకున్నదని రేవంత్ ఆరోపణ చేశారు. మల్లారెడ్డి యూనివర్శిటీ ఉన్న గుండ్లపోచంపల్లి భూముల బండారాన్ని బయటపెట్టారు రేవంత్ రెడ్డి. గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలో 1965 పహానీలో సర్వే నెం 650లో 22 ఏకరాల 8 గుంటలు ఉన్నట్లు ఉందనీ, అదే విధంగా 2000-01 పహనీలో కూడా 22 ఎకరాల 8 గుంటలుగా ఉందన్నారు. అయితే ఆతరువాత ఏమి జరిగిందో ఏమో గానీ ధరణి పోర్టల్ లో 560 సర్వే నెంబర్ లో 33 ఎకరాల 20 గుంటలు అయ్యింది. అది ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.   ధరణి పోర్టల్ ద్వారా ఆ 33 ఎకరాల భూమి పది మంది పేరు మీద విభజన జరిగిందన్నారు. ఇది ఏమైనా కేసిఆర్ ముక్కా రోజు రోజుకు పెరగడానికి, 22 ఎకరాల భూమి 33 ఎలా అయ్యిందని ప్రశ్నించారు. ఈ సర్వే నెంబర్ లో 16 ఎకరాలు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉందని, ఈ శ్రీనివాసరెడ్డి మంత్రి మల్లారెడ్డి బావమరిది అని చెప్పారు.  ఈ 16 ఎకరాల భూమికి శ్రీనివాసరెడ్డి ఎలా యజమాని అయ్యాడని ప్రశ్నించారు. ఈ భూమిని తరువాత శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటికి గిఫ్ట్ డీడ్ చేయగా ఈ భూమి చూపించి మల్లారెడ్డి యూనవర్శిటీ అనుమతులు పొందారన్నారు.  ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఇదే భూమిలో గ్రామ పంచాయతీ అనుమతితో 2004 సంవత్సరంలో లేఅవుట్ అనుమతులు తీసుకుని విక్రయాలు సాగించారనీ, ఆ తరువాత 2015లో హెచ్ఎండీఏ లే అవుట్ తీసుకుని విక్రయాలు సాగించారన్నారు. ఈ మతలబు ఏమిటో చెప్పాలని కోరారు.

నిషేదిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆసుపత్రి ఎలా నిర్మించారు

అదే విధంగా జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనీ, ఈ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రొహిబిషన్ లిస్ట్ లో పెట్టారన్నారు. ధరణి పోర్టల్ లో కూడా అది ప్రభుత్వ భూమిగా ఉందన్నారు. ఇది  కబ్జాలు పెట్టుకుంటుంటే ప్రభుత్వం కబ్జాలను తొలగించి ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఇదే భూమిలో సీఎంఆర్ ఆసుపత్రులు వచ్చాయి. ఈ భూమి మంత్రి మల్లారెడ్డి కోడలు శాలినీరెడ్డి భర్త మహేందర్ రెడ్డి పేరు మీద ఉన్నాయన్నారు. నిషేదిత జాబితాలో ఉన్న ఈ ప్రభుత్వ భూమి శాలినీ రెడ్డి పేరుతో ఎలా సేల్ డీడ్ అయ్యిందో చెప్పాలన్నారు. ఇక్కడి ప్రభుత్వ భూమిలో నాలుగు అంతస్తులతో సిఎంఆర్ ఆసుపత్రి ఏర్పాటు చేసి  వైద్య వ్యాపారం చేస్తుంటే, కేసిఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.

Revanth Reddy vs Malla Reddy: నాక్ గుర్తింపునకు తప్పుడు పత్రాలు

మరో పక్క మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నాక్ గుర్తింపు కోసం తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించారన్న అభియోగంపై నాక్ అయిదేళ్ల పాటు నిషేదం విధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాక్ మల్లారెడ్డి కళాశాల తప్పుడు (ఫోర్జరీ పత్రాలు) పత్రాలు సమర్పించిందని తీవ్ర ఆరోపణలు చేసి నాక్ గుర్తింపునకు అయిదేళ్లు నిషేదం విధిస్తే కేసిఆర్ సర్కార్ యూనివర్శిటీ అనుమతి ఇచ్చిందన్నారు. ఇటువంటి నాయకుడిని పక్కన పెట్టుకుని కేసిఆర్, కేటిఆర్ లు నీతి గురించి, నిజాయతీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఇప్పుడు కొన్ని అంశాలు మాత్రమే బయట పెడుతున్నానన్నారు. తాను చేసిన ఈ విషయాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నారా, మల్లారెడ్డిపై ఏమి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తనపై కుక్కలను ఉసి గొల్పడం కాదు, చేతనైతే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి లేకపోతే గజ్వేల్ లో రాజీనామా చేసి పోటీకి సిద్ధం కావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

చివరగా టాలివుడ్ డ్రగ్స్ కేసు గురించి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. స్వయంగా సీబీఐ, ఈడీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఈడీ దర్యాప్తు వేగవంతం అయ్యిందన్నారు. రేవంత్ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి, సీఎం కేసిఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సోహెల్ పై సెటైర్లు వేసిన కంటెస్టెంట్..!!

sekhar

బొత్స × రెబెల్ ఎంపీ..! సవాల్ మొదలైనట్టేనా..?

Special Bureau

Black thread : నల్లతాడు కట్టుకుంటున్నారా? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి!!

Kumar