తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్ ల పరిస్థితి దారుణంగా తయారైంది. వివిధ రకాల అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ లు, ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం నుండి బిల్లులు మంజూరు కాక ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పనుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనబడక, వడ్డీలు పెరిగిపోయి నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ సర్పంచ్ దంపతులు కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలాన్ని రేపింది.

గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రావడం లేదంటూ నందిపేట గ్రామ సర్పంచ్ వాణి, ఆమె భర్త తిరుపతితో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఇది గమనించిన పోలీసులు, అక్కడ ఉన్న వారు వారిని అడ్డుకున్నారు. పనుల కోసం రూ.2కోట్ల వరకూ అప్పులు చేశామనీ, ఇప్పుడు అది రూ.4 కోట్ల వరకూ పెరిగిపోయిందంటూ వారు వాపోయారు. బిల్లులు రాకుండా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూడా బిల్లుల మంజూరుకు తమకు సహాయం చేయలేదని ఆరోపించారు.
వీరు ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సమయంలో సమయానికి పోలీసులు, స్థానికులు స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి వాటి విషయంలో ప్రత్యేక శద్ద తీసుకుని పెండింగ్ బిల్లులు క్లీయర్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అధికార యంత్రాంగం దృష్టి సారించాలి.
సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం .. తిరిగి గన్నవరంలోనే అత్యవసర ల్యాండింగ్