ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న కవిత పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తాము 24వ తేదీన పిటిషన్ ను విచారిస్తామని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన తమ ఎదుట హజరు కావాలని ఈడీ మరో సారి నోటీసులు జారీ చేయడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళను ఈడీ ఆఫీసుకు పిలవడంపై కవిత అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ వేశారు.

కవిత ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు హజరు కావాల్సి ఉండగా హజరుకాలేదు. అయితే ఈడీ మాత్రం 20న విచారణకు హజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన పిటిషన్ ను త్వరితగతిన విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరగా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్టు చేసింది. దీంతో కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి. కవిత విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఏమి చేయాలనే దానిపై ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక పర్యాయం కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.
మరో పక్క ఇదే కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన కుమారుడు రాఘవరెడ్డి ని ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.
వైరల్ అయిన తన వ్యాఖ్యలపై స్పందించిన మేకతోటి సుచరిత.. వివరణ ఇలా