ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమనాయకుడు, కేసిఆర్ కు సన్నిహితుడుగా పేరున్న కూచాటి శ్రీహరిరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఉద్యమంలో ముందుండి పోరాడినా రాష్ట్ర ఏర్పాటు తర్వాత సరైన గుర్తింపు లభించకపోవడంతో నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా గతంలో బాధ్యతలు నిర్వహించిన శ్రీహరిరావు ఇవేళ జిల్లా కేంద్రంతో తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిందన్నారు. అలాంటి మోసాలను చేయడం ఇష్టం లేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ నెల 17వ తేదీ లోగా శ్రీహరిరావు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. 2007 లో టీఆర్ఎస్ లో చేరిన శ్రీహరిరావు తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసిఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు.