YSRTP Vs CPM: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్, నిరుద్యోగ సమస్య పై అధికార బీఆర్ఎస్ సర్కార్ పై ఉమ్మడి పోరాటం చేసేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఇటీవల ఫోన్ చేసి మాట్లాడారు. ఉమ్మడి ఉద్యమం కోసం టీ సేవ్ ఫోరమ్ ను ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఇవేళ టీజేఎస్, సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలు కోదండరామ్, తమ్మినేని వీరభద్రం, కూనపనేని సాంబశివరావులతో భేటీ అయ్యారు. కలిసి పోరాటం చేసే విషయంపై చర్చలు జరిపారు. నిరుద్యోగుల పక్షాన కలిసి పోరాడేందుకు టీ సేవ్ ఫోరం లో భాగస్వాములు కావాలని కోరారు. అయితే షర్మిల ప్రతిపాదనపై పార్టీలో చర్చించుకుని నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు.

కాగా సీపీఎం పార్టీ కార్యాలయంలో షర్మిల వర్సెస్ తమ్మినేనిగా కార్యక్రమం సాగింది. బీజేపీకి వైఎస్ఆర్ టీపీ బీ టీమ్ అని తమ్మినేని ఎద్దేవా చేశారు. వెంటనే షర్మిల కౌంటర్ అటాక్ చేస్తూ మునుగోడు ఎన్నికల్లో వామపక్షాలు బీఆర్ఎస్ కు బీ టీమ్ గా మారాయని వ్యాఖ్యలు చేశారు. ఏ పోరాటానికినా కలిసి పోరాటం చేద్దామని కబురు చేశారా అని సీపీఎం నేత తమ్మినేనిని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. అయినప్పటికీ తాను మీ కార్యాలయానికి వచ్చి అధికార పక్షంపై పోరాటానికి కలిసి రావాలని ఆహ్వానిస్తున్నానని తెలిపారు. తానేదో బీజేపీ పార్టీకి బీటీమ్ అయినట్లు, తాను నాటకాలు ఆడుతున్నట్లు మాట్లాడటం జరిగింది. తానెప్పుడు నాటకాలు ఆడలేదనీ, మునుగోడు ఎన్నికల సమయంలో కేసిఆర్ కు బీ టీమ్ గా పని చేసింది కమ్యూనిస్టులే నని చెప్పారు. వైఎస్ఆర్ టీపీ ఏనాడూ ఏ పార్టీకి బీ టీమ్ గా పని చేయలేదన్నారు. బీజేపీ పట్ల తమ వైఖరి స్పష్టంగా ఉందనీ, బీజేపీని నిలదీసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యేనని అన్నారు. తన పాదయాత్రలోనూ కేసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాల ఇస్తామని అన్నారు. ఆ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయడం జరిగిందన్నారు.
అనంతరం సీపీఎం నేత తమ్మినేని మాట్లాడుతూ షర్మిల రాజకీయ వైఖరి అమెకు ఉంటుంది. మా రాజకీయ వైఖరి మాకు ఉంటుందన్నారు. మునుగోడు ఎన్నికల్లో తాము చేసిన పని చాటుగా ఏమి చేయలేదు, బహాటంగానే చేశామన్నారు. దానికి తమ రాజకీయ స్టాండ్ ఏమిటో కూడా చెప్పామన్నారు. దేశ రాజకీయాల్లో మా పాత్ర ఏమిటో కూడా చెప్పామన్నారు. పైకి ఒక మాట, చాటున ఒక మాట చెప్పే రాజకీయం సీపీఎం చేయదని అన్నారు. అలాంటి మా పార్టీని వారికి బీ టీమ్, వీరికి బీ టీమ్ అని విమర్శించే సాహసం చేయడం, అది మా పార్టీకి వచ్చి చేయడం మంచిపద్దతి కాదన్నారు. ఆమె మాట్లాడినట్లుగా తాను నిందిస్తూ మాట్లాడలేననీ, మాకు విజ్ఞత, మర్యాద ఉన్నాయన్నారు. అయితే షర్మిల తీసుకువచ్చిన నిరుద్యోగ సమస్యపై పోరాట ప్రతిపాదన మంచిదన్నారు.
తాము కూడా జన చైతన్య యాత్రలో ప్రతి మీటింగ్ లోనూ పేపర్ లీకేజీపై మాట్లాడామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సీరియస్ గా ఎండగట్టామన్నారు. నిస్పక్షపాతంగా విచారణ జరగాలంటే సిట్ కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ వేళ మధ్యాహ్నమే సీపీఐ, సీపీఎం జాయింట్ మీటింగ్ కూడా జరిగిందన్నారు. ఆ మీటింగ్ లోనూ ఈ డిమాండ్ చేశామన్నారు. ఈ సమస్యపై అందరూ కలిసి పోరాటం చేయడం తమకు అభ్యంతరం కాదనీ అయితే అన్ని పార్టీలు అంటే బీజేపీతో కలిసి అంటే తాము వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయో అంత కంటే దుర్మార్ఘంగా కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నాయని విమర్శించారు. దేశం మొత్తాన్ని మతోన్మాదంతో నాశనం చేసిన పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. ఏదైనా ఫోరమ్ పెట్టే ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. తమ పార్టీపై షర్మిల చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
Pawan Kalyan: జనసేన పట్ల బీజేపీ వైఖరి ఏమిటి ..? నేడు క్లారిటీ వచ్చేస్తుందా..! ఢిల్లీలో పవన్ బిజీబిజీ