తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల నిర్వహణ పై విపక్షాలకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నెల 12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. 7న అసెంబ్లీలో సెలవు. తిరిగి 8న బడ్జెట్ పై సభలో సాధారణ చర్చ జరగనున్నది. 9,10,11 మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరగనుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనున్నది.

అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. నిన్నటి బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, కనీసం 20 రోజుల పాటు కొనసాగించాలని ఎంఐఎం పట్టుబట్టింది. సమావేశాల కొనసాగింపు 8వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం ఆరు రోజులు మాత్రమే సభను నిర్వహించడంపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి మరి.
ఇవేళ రెండో రోజు సభ మొదలు కాగానే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య .. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అటు మండలిలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.