Bandi Sanjay Arrest: కరీంనగర్ లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ లోని ఆయన ఇంటి వద్దకు అర్ధరాత్రి భారీగా చేరుకున్న పోలీసులు చేరుకున్నారు. ఏ కేసులో తనను అదుపులో తీసుకుంటున్నారు అని బండి సంజయ్ పోలీసులను పదే పదే ప్రశ్నించినా వారు సమాధానం ఇవ్వలేదు. అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని బండి సంజయ్ అరెస్టును అడ్డుకున్నారు.
ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి దాదాపు ఒంటి గంట ప్రాంతంలో సంజయ్ ను బలవంతంగా అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్లారు. అయితే పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తొంది. అయితే పోలీసులు మాత్రం ఏ కేసులో అరెస్టు చేశారనే దానిపై అధికారికంగా వెల్లడించలేదు. సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఇవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.
తెలంగాణలో వరుసగా రెండో రోజు మంగళవారం కూడా పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. హనుమకొండలో హెచ్ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్ బురం ప్రశాంత్ బ్రేకింగ్ న్యూస్ అంటూ దాన్ని వైరల్ చేశారు. హిందీ ప్రశ్నపత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్ తో పాటు చాలా మందికి దానిని ఫార్వార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సోషల్ మీడియా లో మాటల యుద్దం నడిచింది. జర్నలిస్ట్ ప్రశాంత్ కు సంజయ్ కు సంబంధం ఉందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో మంత్రి ఎర్రబెల్లితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భాస్కర్ తదితరులతో ప్రశాంత్ దిగిన ఫోటోలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బయట పెట్టారు.
ప్రశాంత్ బీజేపీ మనిషంటూ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేమి చెబుతారంటూ నిలదీశారు. వాట్సాప్ లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన వ్యవహారంలో జర్నలిస్ట్ ప్రశాంత్ తో పాటు మరి కొందరిని అరెస్టు చేయడం దుర్మార్ఘమని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణం బండి సంజయ్ ను విడుదల చేయాలని ఆ పార్టీ నేతలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందనరావు తదితరులు డిమాండ్ చేశారు.
Donald Trump: కోర్టులో లొంగిపోయిన డోనాల్డ్ ట్రంప్ .. కస్టడీలోకి తీసుకున్న న్యూయార్క్ పోలీసులు