ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కర్ణాటక లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనబడుతోంది. గతంలో బీజేపీలో చేరాలని భావించిన నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. చేరుతున్నారు. బీజేపీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన తర్వాత కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంత కాలం క్రితం వరకూ అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తాము అని చెప్పుకున్న బీజేపీ .. గ్రాఫ్ పడిపోతుందన్న విశ్లేషణలు మీడియాలో వస్తున్నాయి. మాజీ మంత్రి చంద్రశేఖర్, ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ చార్జి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు ఇటీవల బీజేపీని వీడారు.
తాజాగా రామగుండం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కౌశిక్ హరి బీజేపీకి షాక్ ఇచ్చారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ప్రగతి భవన్ లో మంత్రులు కేటిఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. పార్టీలో చేరేందుకు సంసిగ్దత వ్యక్తం చేశారు. 2009 లో కౌశిక్ హరి ప్రజా రాజ్యం పార్టీ నుండి పోటీ చేసి కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొద్ది రోజుల్ల రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరి సహా పలువురు బీజేపీ నేతలు బీజేపీ పార్టీలో చేరనున్నారు. బీజేపీ నుండి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి, పలువురు అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. కొద్ది రోజులుగా బీజేపీలో చేరికలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి నేతలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచ్చేస్తుండగా, ఈ సభలో దాదాపు 20 మంది నేతలను బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కిషన్ రెడ్డి. ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూనే చేరికలపై యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తొంది బీజేపీ.
అమిత్ షా సభలో భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ లో టికెట్లు రాని వారిపై బీజేపీ ఫోకస్ పెడుతోంది. అమిత్ షా సభలో వివిధ పార్టీల నుండి 20 మంది చేరతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. చాలా రోజుల నుండి బీజేపీ నేతలు భారీగా చేరికలు ఉంటాయంటూ ప్రచారం చేసుకున్నా ఆ దిశగా చేరికలు జరగలేదు. అమిత్ షా సభలో కొంత మంది నేతలు అయితే చేరితే నష్ట నివారణ జరిగినట్లు అవుతుంది.
యూఎస్ తెలుగు విద్యార్ధుల సమస్యపై స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్