తెలంగాణ సర్కార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి టీ హరీష్ రావు ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని వచ్చినట్లు లేదనీ, తెలంగాణపై విషం గక్కడానికే వచ్చారని హరీష్ రావు అన్నారు. మోడీ మాట్లాడిన ప్రతి మాట సత్యదూరమని పేర్కొన్నారు. ప్రధానిగా ఇన్ని అబద్దాలు ఆడటం ఆయనకే చెల్లిందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఆసరా పెన్షన్ లు, రైతు బంధు వంటివి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయన్న విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.

ప్రధాని మోడీ తన వల్లనే డీబీటీ మొదలైనట్లు అనడం పచ్చి అబద్దమని, ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించింది కేంద్ర ప్రభుత్వం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతు బంధుతో పోలిస్తే పీఎం కిసాన్ సాయమెంత అని అన్నారు. రైతు బంధు కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని అన్నారు. పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవమని తెలిపారు. ఐటీఐఆర్ ను బెంగళూరుకు తరలించారని పేర్కొన్నారు.