Telangana TDP: తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ) అధ్యక్షుడుగా ఇప్పటి వరకూ కొనసాగిన ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేసి అధికార టీఆర్ఎస్ బాట పట్టడంతో టీ టీడీపీ అధ్యక్షుడి బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారు అయిన విషయం తెలిసిందే. టీడీపీలో కొనసాగితే ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకున్న నేతలు చాలా మంది అధికార టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రులుగా అయిపోయారు. కొద్ది మంది సీనియర్ నాయకులు మాత్రమే టీడీపీలో మిగిలారు. 2014 నుండి ఎల్ రమణ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఏడాదిన్నర క్రితం ఎల్ రమణను టీడీపీ అధ్యక్ష పదవి నుండి తొలగించి వేరే వారికి అప్పగించాలంటూ పలువురు నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి విన్నవించినా రమణనే కొనసాగిస్తూ చంద్రబాబు నాడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు అర్ధాంతరంగా ఎల్ రమణ చంద్రబాబు బై బై చెప్పి కేసిఆర్ జిందాబాద్ అనడంతో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రధానంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా ముద్రవేయడంలో టీఆర్ఎస్, కేసిఆర్ సఫలం అయ్యారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు పూర్తిగా డైవర్ట్ అయ్యింది. కొద్ది మంది నాయకులు మాత్రమే పార్టీలో మిగిలారు. ఈ నేపథ్యంలో పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతున్న కేడర్ కు అండగా నిలిచేందుకు టీటీడీపీకి నూతన అధ్యక్షుడుని ఎంపిక చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఏర్పడింది. అయితే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సీనియర్ నేతలు ముందుకు రావడం లేదన్న మాట వినబడుతోంది. పార్టీ అదినేత చంద్రబాబు శనివారం తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జిలతో ప్రత్యేకంగా సమవేశం నిర్వహించిన చంద్రబాబు పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అనే దానిపై డిస్కస్ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంలో నేతల నుండి వ్యక్తిగతంగా అభిప్రాయాలను సేకరించినట్లు సమాచారం.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించిన చంద్రబాబు టీ టీడీపీ అధ్యక్ష పదవి కోసం కొన్ని పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కని నర్శింహులు, నన్నూరి నర్శిరెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ తదితర పేర్లను చంద్రబాబు పరిశీలించినట్లు సమాచారం. వీరిలో ఎవరికి పార్టీ చీఫ్ పదవి దక్కుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. అయితే చంద్రబాబు మాత్రం రెండు మూడు రోజులలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.