Telangana TDP: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల ప్రకటించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కుడా లేదని ఇటీవల కాలం వరకూ భావిస్తుండగా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తొలుత అధికార బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించలేదు. కానీ తరువాత టీడీపీ అభిమానులు వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
తెలంగాణలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పొందేందుకే ఎన్నికల వేళ వివిధ రాజకీయ పక్షాల నేతలు ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు నందమూరి బాలకృష్ణ. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడి హోదాలో నందమూరి బాలకృష్ణ ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తొంది. ఇకపై తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం చేస్తామని బాలకృష్ణ అన్నారు.
తాను ఇక్కడే ఉండి పార్టీని రక్షించుకుంటానని బాలకృష్ణ ప్రకటించి పది రోజులు కాకముందే ఓ సీనియర్ నాయకుడు పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమవుతున్నారని వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల త్రిముఖ పోటీ నెలకొంది. అధికారం నిలుపుకోవడం కోసం బీఆర్ఎస్, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. వివిధ పార్టీలోని బలమైన నేతలుగా ఉన్న వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎవరికి వారు పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ చేరనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు, ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే రావుల బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలతో చర్చలు కూడా జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15వ తేదీలోపు రావుల బీఆర్ఎస్ లో చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ప్రచారంపై రావుల మాత్రం ఇంత వరకూ స్పందించలేదు.
రావుల చంద్రశేఖరరెడ్డి టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్నారు. 1985 లో టీడీపీ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా, 87లో పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. 1994 లో వనపర్తి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్ గా పని చేశారు. 2002,2008లో రాజ్యసభ్యుడుగా ఎన్నికైయ్యారు. 2009లో మరో సారి వనపర్తి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి దాదాపు 45వేల వరకూ ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్ధి 4,291 ఓట్ల తో విజయం సాధించారు.
2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత టీడీపీ ముఖ్య నేతలు చాలా మంది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ రావుల చంద్రశేఖరరెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. నియోజకవర్గంలో సొంత ఓటు బ్యాంక్ ఉన్న రావుల చంద్రశేఖరరెడ్డి బీఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీకి అదనపు బలం అవుతుందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి ఈ పరిణామం బీగ్ ఝలక్ కిందే భావించాల్సి వస్తుంది.
Chandrababu Arrest: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ .. స్కిల్ కేసులో లభించని ఊరట