ACB: అవినీతి సర్వాంతర్యామి. కాకపోతే కొన్ని వెలుగులోకి వస్తుంటాయి. వెలుగులోకి రానివి మరెన్నో ఉంటాయి. దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర అన్న సామెత మాదిరిగా తయారైంది సమాజం. ఎవరైనా బాధితుడు ఫిర్యాదు చేస్తేనే అవినీతికి పాల్పడే అధికారులను పట్టుకుంటున్నారు తప్పితే కార్యాలయాలపై నిఘా పెట్టి అవినీతి జరగకుండా అరికట్టలేకపోతున్నది అవినీతి నిరోధక శాఖ. అప్పుడప్పుడు ఎసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వారిని పట్టుకుని జైలుకు పంపుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ..సమాజానికి స్పూర్తిదాయకంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు కూడా అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతుండటం గమనార్హం.

తాజాగా తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కారు. తార్నాకలోని తన నివాసంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పరీక్షా కేంద్రం అనుమతి కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుండి రూ.50వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆయన నివాసంలో తనిఖీలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది. వీసీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. గత వారమే ఆయన నివాసంలో, చాంబర్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తొంది. అయితే ఆ సోదాల్లో ఎలాంటి వివరాలు సేకరించారు అన్నది వెల్లడి కాలేదు. ఆయనపై ఏసీబీ నిఘా ఉన్న విషయాన్ని సైతం విస్మరించి నిర్బయంగా ఇవేళ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం విశేషం.
Bapatla: టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన .. బాధిత కుటుంబానికి ప్రభుత్వ హామీ