వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు షర్మిల చలో ఉస్మానియా ఆసుపత్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షర్మిల ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. షర్మిల లోటస్ పాండ్ లోని తన నివాసం నుండి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వివాదానికి దిగారు. పోలీసులతో కార్యకర్తలు వాగ్వివాదానికి దిగడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో షర్మిల కిందపడిపోయారు.

ఈ సందర్భంగా షర్మిల మరో సారి కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కేసిఆర్ మరో సారి తన నియంత అని నిరూపించుకున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ బిడ్డను, వైఎస్ఆర్ టీపీని చూసి కేసిఆర్ సర్కార్ భయపడుతోందన్నారు. తాను చేస్తున్న పాదయాత్రను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అడిగే ప్రతి అనుమతిని అపుతూనే ఉన్నారని అన్నారు.
ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు షర్మిల. రూ.200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం తొమ్మిదేళ్ల క్రితం చెప్పారని గుర్తు చేశారు. ప్రజలకు వైద్యం అందడం లేదని తనకు పిర్యాదు వచ్చాయని తెలిపారు. ప్రతిపక్షాలను ఆపడానికి శాంతి భద్రతల సమస్య అంటారా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల.