Road Accident: వాహనాలు నడిపే వారు అజాగ్రత్త, నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఒక్కో సారి పెను ప్రమాదాలకు కారణం అవుతుంది. ఓ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఓ చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ ను కారు ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్, క్లీనర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల పాప మృతి చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. డీసీఎం వ్యాన్ కు పంక్చర్ కావడంతో డ్రైవర్, క్లీనర్ లు వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తున్నారు. ఈ సమయంలో వేగంగా వస్తున్న కారు .. వ్యాన్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వ్యాన్ టైరు మారుస్తున్న డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. వ్యాన్ ను బలంగా కారు ఢీకొనడంతో కారు కుదుపుకు కారులో ఉన్న ఆరేళ్ల పాప మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.