టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో కేసిఆర్ పాలనపై, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో స్వపక్షంలోని అసమ్మతి సీనియర్ నేతలపైనా పరోక్షంగా కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. తమ పార్టీలో చాలా మంది పెద్ద రెడ్లు కేసిఆర్ కు అమ్ముడుపోయారనీ, అందుకే కొత్త తరానికి అవకాశం వచ్చి తాను పీసీసీ చీఫ్ అయ్యానని పేర్కొన్నారు. తమ పార్టీలో సీనియర్లైన సబిత, గుత్తా సుఖేందర్ రెడ్డి, సురేష్ రెడ్డి లాంటి నేతలు వారి స్వార్థం కోసం పార్టీ మారారని అన్నారు.

త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. ఎవరు అభ్యంతరం తెలిపినా చేరికలు ఆపొద్దని రాహుల్ గాంధీ చెప్పారని రేవంత్ పేర్కొన్నారు. బండి సంజయ్, అరవింద్ లు తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. బీజేపీ ప్రాధాన్యతలో తెలంగాణ లేదనీ, ఇక్కడి నేతలూ లేరని అన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో సీట్లు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అధికార బీఎస్ఎస్ పార్టీ కేవలం 25 సీట్లకే పరిమితం అవుతుందన్నారు. ఇక బీజేపీకి ఏడు ఎనిమిది సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని, 32 నుండి 34 శాతం ఓట్లు వస్తాయని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి .. కేవలం అయిదు శాతం ఓట్ల కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను కొడంగల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందనీ, కలిసివచ్చే పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.