TSPSC paper leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సీట్ అధికారులు ఇవేళ మరో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. సిట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలను ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఆదివారం విచారణకు హజరు కావాలని తెలిపారు. కాగా పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంతకు ముందూ ఒక సారి నోటీసులు అందజేశారు. ఈ నెల 24వ తేదీ తమ ముందు హజరు కావాలని సిట్ అధికారులు కోరారు. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ సిట్ విచారణకు గైర్హజరు అయ్యారు. సిట్ విచారణకు బండి సంజయ్ హజరు కాని నేపథ్యంలో ఇవేళ మరో సారి నోటీసులు ఆయన ఇంటిలో ఇచ్చారు సిట్ అధికారులు.

అయితే సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని పేర్కొన్న ఎం పీ బండి సంజయ్.. తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదల్చుకోలేదని తెలిపారు. తనకు నమ్మకమున్న సంస్థలకే సమాచారం ఇస్తానని చెప్పారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీ అంశంలో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. జగిత్యాల ప్రాంతానికి చెందిన వారే అత్యధికంగా క్వాలిఫై అయ్యారని వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ కి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారంటూ ఆరోపణ చేశారు. కాగా ఈ ఆరోపణల్లో భాగంగా సిట్ విచారణకు హజరైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. వారికి ఎలాంటి ఆధారాలు అప్పగించలేదు.