Telangana Election: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసంతృప్తి నేతలు పక్క పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో సిద్దాంతాలు, ఆశయాలు అంటూ ఏమి లేకుండా పార్టీలో టికెట్ దక్కక పోతే తిరుగుబాటు చేస్తున్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించడంలో కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు సఫలం అయ్యింది. దీంతో పలు నియోజకవర్గాల్లో టికెట్ లు ఆశించి భంగపడిన నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలో ఉండేందుకు సిద్దమవ్వగా, పార్టీ నేతలు వారితో సంప్రదింపులు జరిపి బుజ్జగించారు.
దీంతో వారు తమ నామినేషన్ లు ఉపసంహరించుకున్నారు. పలువురు నేతలకు ఎంపీ టికెట్లు, మరి కొందరికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, కార్పోరేషన్ పదవులు హామీలు ఇచ్చారు. కొందరికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు దారికి వచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి ఇవేళ ఇద్దరు కీలక నేతలు చేరారు. ఒకరు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా, మరొకరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఇద్దరు నేతలు ఎంపీ సీటు హామీతో హస్తం పార్టీలో చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించిన నాటి నుండి విజయశాంతి సహా పలువురు కీలక నేతలు పార్టీ తీరుపై అగ్రహంతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ఒకటి రెండు సార్లు ఆమె నివాసంలో బీజేపీ అసంతృప్తి నేతలు సమావేశమై చర్చించారు. ఆమె నివాసంలో నెల రోజుల క్రితం సమావేశమైన నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీంద్రరెడ్డి, వివేక్ వెంకట స్వామి లు ఇప్పటికే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా, విజయ శాంతి కాస్త ఆలస్యంగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయిన్స్ జాబితాలో విజయశాంతి పేరు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విజయశాంతి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు పార్టీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తొంది.
ఇక బీఆర్ఎస్ నుండి మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాధం కూడా ఇవేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మందా జగన్నాధం తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయనకు కేసిఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో పోతుగంటి రాములును బరిలోకి దింపింది బీఆర్ఎస్. అప్పటి నుండి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ టికెట్ ను తన కుమారుడికి ఇవ్వాలని ఆయన బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరగా, నిరాకరించింది.
ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రీసెంట్ గా గద్వాల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలోనూ పాల్గొన్న మందా జగన్నాదం అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడారని అంటున్నారు. మందా జగన్నాధం పార్టీ మార్పు విషయంలో మాజీ ఎంపీ, ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్ది మధు యాష్కీ, అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్ధి సంపత్ లు కీలక భూమికను పోషించారని సమాచారం.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మందా జగన్నాధం 1996,99,2004 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపిగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఆ పార్టీ అభ్యర్ధిగా నాల్గవ సారి గెలిచారు. కేసిఆర్ దీక్ష తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు.