YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. గురువారం పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను పోటీకి నిలపాలని నిర్ణయించారు. పాలేరు నియోజకవర్గం నుండి షర్మిల బరిలోకి దిగనున్నారు. పార్టీ బీఫామ్ ల కోసం ధరఖాస్తు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు. పాలేరుతో పాటు మరో చోట పోటీ చేయాలనే డిమాండ్ కూడా ఉందని చెప్పారు.

తనతో పాటు అనిల్, విజయమ్మలను కూడా పోటీ చేయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారనీ, అవసరమైతే వారిద్దరు కూడా పోటీ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అని అనుకున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే కేసిఆర్ మళ్లీ సీఎం అవుతారేమోనని అనుకున్నామనీ, అందుకే కాంగ్రెస్ తో విలీనంపై చర్చలు జరపడం జరిగిందన్నారు. నాలుగు నెలల పాటు ఎదురుచూశామన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకువస్తామని షర్మిల తెలిపారు.

గత కార్యవర్గ సమావేశంలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటమ్ జారీ చేసారు. గత నెల 30వ తేదీ లోపు విలీనంపై కాంగ్రెస్ తేల్చకపోతే అక్టోబర్ మొదటి వారంలో వైఎస్ఆర్ టీపీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ లోపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు షర్మిలతో చర్చలు జరిపి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం షర్మిల డిమాండ్ లపై సానుకూలంగా స్పందించలేదని సమాచారం. తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని షర్మిల స్పష్టం చేయడంతో విలీన ప్రక్రియ ముందుకు సాగలేదని అంటున్నారు.
వైఎస్ షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తే అధికార బీఆర్ఎస్ కు విమర్శనాస్త్రం ఇచ్చినట్లు అవుతోందని కాంగ్రెస్ భావిస్తొంది. షర్మిలను పార్టీలోకి చేర్చుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఆమె సేవలను వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంటే, ఏపీకి వెళ్లడానికి షర్మిల సుముఖంగా లేనట్లుగా చెబుతున్నారు. తెలంగాణ కోడలిగా తనకు ఇక్కడ రాజకీయం చేసే హక్కు ఉన్నట్లుగా షర్మిల బీష్మించుకుని కూర్చోవడం, అభ్యర్ధుల ఎంపికపైన కాంగ్రెస్ అధిష్టానం బిజీలో ఉండటంతో వైఎస్ఆర్ టీపీ విలీన ప్రక్రియ బ్రేక్ పడింది. మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దమవుతోంది వైఎస్ఆర్ టీపీ.