వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మహబూబాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. పాదయాత్ర అనుమతులు రద్దు చేసి అరెస్టు చేశారు. వైఎస్ షర్మిల పాదయాత్ర మహబూబాబాద్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న పాదయాత్ర సమయంలో నెళ్లికుదురు మండల కేంద్రంలో అక్కడి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను అసభ్య పదజాలంతో దూషించారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరో పక్క షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు ఆందోళన చేపట్టారు.

షర్మిల నైట్ క్యాంప్ వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు మోహరించారు. మాన్ సింగ్ తండా వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారిన నేపథ్యంలో షర్మిల పాదయాత్ర అనుమతి రద్దు చేస్తున్నట్లుగా పోలీసులు నోటీసులు అందజేశారు. అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. అక్కడి నుండి ఆమెను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. షర్మిల బస చేసిన ప్రాంతానికి ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు.
మహబూబాబాద్ లో వైఎస్ షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఆమెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొజ్జాల్లా ఉన్న కొందరు ఆంధ్రా వలస వాదులు వస్తున్నారంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. పర్యటనలు చేసుకుంటే చేసుకోవాలీ కానీ మాట్లాడే భాష ఆదుపులో లేకుంటే మాత్రం కంకర రాళ్లకు మరో సారి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలకు కనుసైగ చేస్తే చాలు తరిమి తరిమి కొడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.