Congress: వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, పార్టీ విలీనం దాదాపు ఖరారు అయ్యింది. పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యారు వైఎస్ షర్మిల. తుది దశకు చర్చలు చేరుకున్నాయని వైఎస్ షర్మిల స్వయంగా చెప్పడంతో అతి త్వరలో షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా మారిపోనున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే .. వైఎస్ షర్మిల తలచింది ఒకటి అయితే పార్టీ అధిష్టానం మదిలో మరొకటి ఉంది. తెలంగాణలో రాజకీయాలు చేయాలని షర్మిల ఆశలు పెట్టుకుంటే .. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమె సేవలను ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవాలని భావిస్తున్నదట. సమైక్యవాదిగా ముద్రపడిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ కావడంతో పాటు ఆంధ్ర మూలాలు ఉండటంతో తెలంగాణ ప్రజలు షర్మిలకు కనెక్ట్ కాలేకపోతున్నారు. షర్మిల విద్యాభ్యాసం చేసింది హైదరాబాద్ లో అయినప్పటికీ, మెట్టినిల్లు తెలంగాణ అయినప్పటికీ 2019 ఎన్నికల వరకూ ఆమె సొంత గ్రామం పులివెందుల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్ బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా 2014, 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత .. వైసీపీలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇతరత్రా కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల భూమికను పోషించినట్లయితే మరో మారు కేసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భయపడుతోంది. షర్మిల రాజకీయ పార్టీ పెట్టిన నాటి నుండి కూడా ఆమె ను ఏపీ సీఎం జగన్ సోదరిగానే తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీల నేతలు భావిస్తూ మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలో తాను పెరిగింది తెలంగాణ గడ్డపై, తెలంగాణ కోడలిని ఇక్కడ రాజకీయం ఎందుకు చేయకూడదు, ఇక్కడి ప్రజల కోసం ఎందుకు పని చేయకూడదు అంటూ షర్మిల ప్రశ్నించారు.

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ రాజకీయం చేస్తే బీఆర్ఎస్ సెంటిమెంట్ రగిల్చే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఆమెను తెలంగాణ, ఏపీలో స్టార్ కాంపెయినర్ గా ప్రచారానికి ఉపయోగించుకోవాలని, ఏపీ పార్టీ బాధ్యతలే అప్పగించాలని భావిస్తున్నదట. ఆ క్రమంలో ఆమె పాలేరు నుండి పోటీ చేయాలని భావిస్తున్నా వద్దని వారించి కర్ణాటక నుండి రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారుట. పాలేరు టికెట్ ప్రస్తుతం షర్మిలకు ఇచ్చే అవకాశం లేదని తేలిపోతుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరిక దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయనకు పాలేరు టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే చెప్పుకోవాలి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ కాంగ్రెస్ లో ఊపు తెప్పించింది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అన్న రీతిలో తయారు అయ్యింది. ఈ పరిస్థితుల్లో షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు అంటున్నారుట.
షర్మిల మూలంగా చేతుల దాక వచ్చిన అధికారం పూర్తిగా చేజారిపోయే ప్రమాదం ఉందని పార్టీ హైకమాండ్ వద్ద పలువురు నేతలు హెచ్చరించినట్లుగా తెలుస్తొంది. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఏమీ జోక్యం చేసుకోనీయకుండా చేయాలన్నది వారి ఆలోచనగా ఉందని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆ క్రమంలోనే షర్మిలకు పాలేరు టికెట్ ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పిందని అంటున్నారు. కర్ణాటక నుండి రాజ్యసభకు పంపుతామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిన అది ఇప్పట్లో సాధ్యం అయ్యేది కాదు. తెలంగాణ, ఏపీ ఎన్నికల తర్వాత సాధ్యం అవుతుంది. దీంతో షర్మిల అన్ కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కోసం పని చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చి, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడితే షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత రాజ్యసభకు పంపే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది చెబితే అలా చేయడానికి సిద్దమైతే షర్మిల పార్టీలో చేరవచ్చు. అయితే ఇక్కడ తుది నిర్ణయం తీసుకోవాల్సింది వైఎస్ షర్మిలయే.
Breaking: ఇబ్రహీంపట్నం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం .. రెండో యూనిట్ లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి