YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన భర్త బ్రదర్ అనిల్ తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ముందుగా బెంగళూరులో అక్కడి పీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక డిప్యూటి సీఎం శివకుమార్ తో చర్చలు జరిపారు. మొదటి నుండి డీకే శివకుమార్ తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల వైఎస్ఆర్ టీపీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి వైఎస్ షర్మిల ముందుకు వచ్చారు. అయితే వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో కీలక భూమికను పోషించడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల కూడా సీరియస్ గానే కౌంటర్ ఇచ్చారు.
సోనియా గాంధీకి మెట్టినిల్లు ఇండియా, తనకు మెట్టినిల్లు తెలంగాణ, ఇక్కడ రాజకీయంలో ఉండటానికి తనకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణలో కొందరు నాయకులు మాత్రం ఆమె ను కాంగ్రెస్ పార్టీలో చేరికను స్వాగతిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమె సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవాలా లేక ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవాలా అనే దానిపై ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పుడు ఈ అంశమే ఆసక్తికరంగా ఉంది. ఈ అంశాలపై వైఎస్ షర్మిల ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ తర్వాత రాహుల్ గాంధీతో ఫైనల్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. కానీ ఏపీలో మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ మొత్తం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిప్ట్ అవ్వడంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి నైరాశ్యంలో ఉంది. షర్మిలకు ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే 2024 ఎన్నికలకు కాకపోయినా 2029 ఎన్నికల నాటికి పుంజుకుంటుంది అన్న భావన ఏపీ కాంగ్రెస్ నేతల్లో ఉంది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో ఇవేళ జరిగే ఫైనల్ చర్చల అనంతరం వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీనంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.
మరో నాలుగైదు రోజుల్లోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు మూహూర్తం అంటుందని అనుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ ప్రారంభించినప్పటి నుండి సీఎం కేసిఆర్, బీఆర్ఎస్ టార్గెట్ గా షర్మిల అనేక పోరాటాలు చేశారు. తెలంగాణలోనే తన రాజకీయం కొనసాగాలన్న పట్టుదలతో షర్మిల ఉన్నారు. పాలేరు నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు షర్మిల సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో వేచి చూడాలి.
2024 ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు