ట్రిప్పుల ట్రిక్కులు, తిప్పలు…!

18 Mar, 2020 - 12:51 PM

వెంకన్న : ఏమోయ్ మంగ… ,ఇదిగో పద్మా…! ఇద్దరూ ఆ బ్యాగులు సర్దుకోండి..!
మంగ, పద్మ ఇద్దరూ : అయ్యో..! ఏమైందండీ. మమ్మల్ని పుట్టింటికి పంపించేస్తారా ఏంటి? మేమేం చేసాం.?
వెంకన్న: అబ్బా…! అలా కాదర్రా, అంత దూరం ఆలోచించొద్దు. మిమ్మల్ని విడిచి నేను ఉండగలనా ఏంటి..? “అలా అలా షికారుకు వెళ్ళొద్దాం. ఆ కైలాసానికి వెళ్లి శివ గాడిని, అక్కడి నుండి బ్రహ్మ గాడి దగ్గరకి వెళ్లి చూసొద్దాం. పనిలో పనిగా కాణిపాకంలో ఉన్న శివగాడి పెద్దోడు గణేష్ కి కూడా సెలవులిచ్చారో లేదో కనుక్కో.., అలాగే తానేపల్లి, తిరుత్తణి లో ఉన్న శివ గాడి చిన్నోడికి కూడా సెలవులు ఇచ్చే ఉంటారుగా కనుక్కో. వాళ్ళిద్దర్నీ కూడా వచ్చేయమను. మనందరం శివ దంపతులు, బ్రహ్మ దంపతులతో కలిసి అలా అలా భూలోకం తప్ప అన్ని లోకాలు తిరిగొద్దాం. చాల రోజులయిందిగ ట్రిప్ వేసి. ఇంకో మాట షిర్డీలో బాబాకి సెలవులిచ్చేశారట, మనకు అయితే తగ్గించారు, కానీ బాబాకి పూర్తిగా కొద్దీ రోజులు గుడిని మూసేసారట. ఆయన్ని రమ్మని నేను అడుగుతాలే.

తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ..!

మంగ, పద్మ ఇద్దరూ : అయ్యో భూలోకానికి వెల్దామండీ చాలారోజులయ్యింది…!
వెంకన్న: వామ్మో…! ఎంత మాటన్నావ్..! (కరోనా తల్లి క్షమించు. నీ ప్రభావం తెలియక, నీవున్న చోటకు వెళ్లాలని మా పద్మ కోరుకుంది. నేను తనకు అర్ధమయ్యేలా చెప్తాలే)
వెంకన్న: ఇదిగో పద్మా.., ఇదిగో మంగ…! మనకు సెలవులు వచ్చిందే చాలా ఏళ్ళ తర్వాత. వీటిని శ్రద్ధగా వాడుకోకుండా మళ్ళీ ముదనష్టపు వైరస్ దగ్గరకు వెళదాం అంటావేంటి. కరోనా అని అక్కడ ఒక బూచి తిరుగుతుందట. అది తిరుగుతుందని జనాలు బయటకు తిరగడం మానేశారు. అందుకే మనకు పెద్దగా ఈ కోరికలు రాసుకునే పని పడట్లేదు. కాస్త ఖాళీ దొరికింది. ఆ బాబాకి సెలవులు వచ్చాయి.
అలివేలు మంగ : కరోనానా… ???
వెంకన్న: “ఆ అదే. కరోనానే. ఓ కలవరించకు, అదసలే మంచిది కాదు వైరస్…! ఆ మనుషులకు మెదళ్ళు ఎక్కువయ్యాయి కదా. ఏవేవో కనుక్కుంటారు కదా. రోబోలని, ఫోన్లని, కంప్యూటర్లని… వాటి లాగానే ఈ వైరస్నికూడా వారికి తెలియకుండా కనిపెట్టేసారు. దీనికి యాంటీ వైరస్ కనిపెట్టలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇదే మనకు మాంచి టైం. ఆ యాంటీ వైరస్ వచ్చేసిందంటే ఇక ఆగరు. చలో మని ఈ గ్యాప్ కవరయ్యేలా మన దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు మనకు తీర్ధ, నైవేద్యాలు కూడా ఉంటాయో ఉండవో… అసలా ఈ కోరికల నుండి గ్యాప్ దొరుకుతుందో దొరకదో. అన్నీ రాసుకోలేక చెమటల్లో చావాలి. అందుకే పదండి మొత్తం తిరిగి వచ్చేద్దాం. ఆ భూలోకం గాలి కూడా మన వైపునకు రాకుండా చూసుకుందాం. వీలైతే ఒక లక్ష మాస్కులు కూడా బ్యాగులో పెట్టండి. పైన కూడా పెట్టుకుని తిరుగుదాం. ఆ మానవ వెధవలు సామాన్యులు కాదు. “కరోనా తగ్గితే నీ కొండకు వస్తామని, స్వామి… ఈ కరోనాని నువ్వే తీసుకుని మాకు ముక్తిని ఇవ్వమని ఇంటిలో నుండే వింత కోరికలు కోరుతుంటారు. అప్పుడు మన భోళా శివయ్య దాన్ని తెచ్చినా తెచ్చేస్తాడు. అసలు దాని జోలికి మనం వెళ్లొద్దు. మనకు సెలవులు వచ్చాయ్, ఎంజాయ్ చేద్దాం అంతే. చలో…!
(అదండీ సంగతి. మోడరన్ దేవుడి ప్రస్తుత పరిస్థితి)

రేయనక, పగలనక…! ఎండనక, వాననక…! కుప్పలు తెప్పలుగా.., లక్షలు కోట్లుగా.., భక్తనే వేషంతో, ముక్తనే మేకప్ తో, కోరికనే స్వార్ధంతో, విపరీతంగా జనాలు వచ్చేస్తున్నారు. పాపం విశ్రాంతి ఉండట్లేదు. సమయానికి తీర్ధనైవేద్యాలంటూ పెడుతున్నా… అసలు ఈ కోట్లాదిగా వచ్చే భక్తులు కోరే కోరికల నుండి విరామం ఉండట్లేదు. ఆ రాహుకేతులు, సూర్య చంద్రుల పుణ్యాన ఎప్పుడో గ్రహణాలకు అంటే ఏడాదిలో రెండు, మూడు రోజులు మాత్రమే సెలవిస్తారు. అటువంటి దేవుళ్ళకు, అంత బిజీగా ఉండే దైవాలకు, భక్తులతో అంతగా గడిపే భగవంతులకు సెలవులొచ్చాయి. మరి కాస్త సెలవులను ఎంజాయ్ చేయాలి కదా. కరోనా ప్రభావంతో షిర్డీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసారు. తిరుమలలో రద్దీ బాగా తగ్గింది. గంటలోనే పూర్తి దర్శనం అయిపోతుంది. లక్షల సంఖ్యలో భక్తులు వేలు, వందలకు పడిపోయింది. ఇతర ఆలయాలు మూసివేతకు చర్చిస్తున్నారు. - శ్రీనివాస్ మానెం