ఎందుకీ సర్వేల గోల?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పై ఉభయ రాష్ట్రాలే కాదు యావత్త్ దేశం ఆసక్తిగా చూస్తున్నది. నెల రోజుల పాటు హోరాహోరీ ప్రచారంలో తెరాస, ప్రజాకూటమి నేతలూ తమ వాక్చాతుర్యాన్ని, దూషణాపటిమను ప్రదర్శించి తామేమిటో, ఏం చెప్పదలచుకున్నామో చెప్పేశారు. ఇక మిగిలింది ఓటరు తీర్పే. రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చే సర్వేలతో చాలా వరకూ ఫలితం ఎలా ఉంటుందన్నది కూడా తేలిపోతుంది. అయితే ఇన్ని రోజుల పాటు చేసిన ప్రచారం చాలదన్నట్లు తెరాస, ప్రజాకూటమి కూడా సర్వేలంటూ ఓటరును గందరగోళ పరిచేందుకు చేస్తున్న ప్రయత్నం ఒకింత ఎబ్బెట్టుగా కనిపిస్తున్నది. టిన్యూస్-నమస్తే తెలంగాణ సర్వే, లగడపాటి సర్వే అంటూ నిన్న రెండు సర్వేల అంశం హల్ చల్ చేసింది.

చివరి రోజు నేతల ప్రచారాన్ని సైతం పూర్వపక్షం చేసి రాష్ట్రమంతా ఈ సర్వేల గురించే మాట్లాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. అసలు ఇలా ముందస్తుగా సర్వేలు విడుదల చేయాల్సిన అవసరం టిన్యూస్- నమస్తే తెలంగాణ టీమ్ కు కానీ, లగడపాటికి కానీ ఏ మొచ్చింది? మొత్తంగా చూస్తే..హోరాహోరీ పోరులో సర్వేలను కూడా ప్రచారాస్త్రాలుగా మార్చుకునే వ్యూహం కనిపిస్తున్నది. ఓడిపోయే పార్టీకి ఓటెందుకు వేయాలని సగటు ఓటరు భావిస్తాడన్న అంచనా ఆధారంగా పార్టీలూ సర్వేలతో అటువంటి వారిని ప్రభావింతం చేసే ప్రయత్నంగా నిన్నటి నుంచి జరుగుతున్న హంగామా కనిపిస్తున్నది.