ఎవరి ధీమా వారిదే-హంగ్ ఊహల నేపథ్యంలో వ్యూహాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు రేపు తెరపడుతుంది. ఈ లోగా సర్వేల ఫలితాలు, ఓటింగ్ సరళి పట్ల ప్రజాకూటమి, తెరాస కూడా లెక్కలు వేసుకుని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన ఓటింగ్ శాతం వల్ల తమకే లాభం అని ఎవరికి వారు చెప్పుకుంటున్నాయి. అదే సమయంలో హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏమిటన్నదానిపై కూడా వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజాకూటమి నేతలు మరి కొద్ది సేపటిలో గవర్నర్ ను కలిసి కూటమి అభ్యర్థులందరినీ ఒక్కటిగానే చూడాలని కోరనున్నారు. మరో వైపు హంగ్ ప్రశక్తే లేదు…గెలుపు మాదే అని తెరాస గంభీర ప్రకటనలు జారీ చేస్తున్నప్పటికీ…మజ్లిస్ తో చర్చలు జరుపుతోంది. హంగ్ ఏర్పడితే తెరాసకు మద్దతు ఇస్తామంటూ బీజేపీ కూడా ప్రకటన చేయడం..ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠను మరింత పెంచడానికే తప్ప మరో కారణం కనబడదు. ఏది ఏమైనా మరో 24 గంటలలో తెలంగాణ ఫలితాలు వెలువడనున్నాయి. పలితాలు పూర్తిగా వెలువడకపోయినా…ఫలితం ఎలా ఉండబోతున్నదన్న స్పష్టమైన సంకేతాలు అయితే వచ్చేస్తాయి. ఈ లోగా హంగ్, కింగ్, మేం గెలుస్తున్నాం అంటూ చేస్తున్న ప్రకటనలు సస్పెన్స్ మరింత పెరగడానికి, పెంచడానికీ మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఈ సారి ఈ ఎన్నికల ఫలితాల పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం మొత్తం ఆసక్తి వ్యక్తం కావడానికి మాత్రం ప్రత్యేక కారణం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలే జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పార్టీల ఐక్యత బలోపేతం అవుతుందా, చర్చల స్థాయిలోనే చతికల బడుతుందా అన్నది తెలంగాణ ఎన్నికల ఫలితాలను బట్టే ఉంటుంది.ఎందుకంటే…జాతీయ స్థాయిలో ఏర్పడే కూటమి తొలిసారిగా జాతీయ పార్టీల నేతృత్వంలో కాకుండా..బలమైన ప్రాంతీయ పార్టీల చొరవతో, నాయకత్వంలో ఏర్పడనుంది. తెలంగాణలో కూటమికి అనుకూలంగా ఫలితం వస్తే జాతీయ స్థాయిలో ఏర్పడబోయే కూటమిలో కాంగ్రెస్ పాత్ర భాగస్వామ్యపక్షానికే పరిమితంగా ఉంటుంది. అలా కాకుండా తెలంగాణలో కూటమికి ప్రతికూలంగా ఫలితాలు ఉంటే…కూటమి ఏర్పడటమూ, ఒక వేళ ఏర్పాటైనా అది బలంగా ఉండటమూ కష్టమే. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో తెలంగాణ ఎన్నికల పట్ల తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది.