ఓటుపై పెరిగిన జనచైతన్యం

తెలంగాణ ఎన్నికలలో పోలింగ్ సరళిని చూస్తుంటే ఓట వేయాలన్నభావన ప్రజలలో పెరిగిందని అనిపిస్తున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరి నిలబడి ఉండటం..పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా…ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోకుండా ఓపికగా వాటిని సరిచేసి పోలింగ్ ప్రారంభమై తమ వంతు వచ్చేవరకూ వేచి ఉండటం ఓటుపై జనంలో పెరిగిన చైతన్యానికి గుర్తుగా భావించవచ్చు. తెలంగాణలో పోరు హోరాహోరీగా ఉందన్న భావన, గతానికి భిన్నంగా ఈ సారి దాదాపుగా అన్ని చోట్లా ముఖాముఖి పోరు జరుగుతున్న పరిస్థితి కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ముందుకు రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. గత ఎన్నికలలో అయితే జంటనగరాల ఓటర్లు ఓటింగ్ పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదు. పోలింగ్ శాతం కూడా తక్కువగా నమోదైంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా జంటనగరాలలో కూడా పోలింగ్ శాతం భారీగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం కూడా జనం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గతంలో కంటే ఎక్కువ ఆసక్తి  చూపడానికి  ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది.