కూటమి సాకారం బాబు కృషి ఫలితమే!

ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలలో తనదైన పాత్రను మరోసారి పోషించేందుకు సర్వం సిద్ధమైంది. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నడుంబిగించిన చంద్రబాబు ఇప్పటికే పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. ఇప్పుడు బీజేపీయేతర పార్టీల నాయకులంతా యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా నేతృత్వంలో భేటీ కానున్నారు. ఈ భేటీ కార్యరూపం దాల్చేందుకు కర్త, కర్మ, క్రియా అన్నీ చంద్రబాబునాయుడే. ఏపీకి కేంద్రంలోని మోదీ సర్కార్ అన్యాయం చేసింది, మిత్రద్రోహానికి పాల్పడిందని ఆరోపిస్తూ కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన క్షణం నుంచీ ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం, బీజేపీ యేతర పార్టలను ఏకతాటిపైకి తీసుకురావడం అన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమిలో తెలుగుదేశం పార్టీని భాగస్వామిని చేయడంతో ఆగకుండా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూటమి విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. కూటమి విజయంపై ఆశలు రేగడానికి కారణం చంద్రబాబు ప్రచారం, వ్యూహరచనే కారణమని కాంగ్రెస్ మాత్రమే కాదు, ఆఖరికి తెరాస కూడా భావిస్తున్నదంటే ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంతగా దృష్టి పెట్టారో అర్ధమౌతుంది. ఇప్పుడు అదే దృష్టి జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటు సాకారం అయ్యేందుకు కేంద్రీకృతం చేశారు. ఈజు హస్తినలో జరిగే కాంగ్రెసేతన పార్టీల భేటీకి 14 పార్టీల అధినేతలు, అగ్రనాయకులు హాజరు అవుతున్నారంటే అది చంద్రబాబు కృషి ఫలితమేనని చెప్పాలి. జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమి ఏర్పాటుకు పలు పార్టీలు సుముఖంగానే ఉన్నాయి. కర్నాటక ఎన్నికల కు ముందు నుంచీ కూడా బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా కొంత హడావుడి చేశారు. అయితే జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ మద్దతు లేకుండా బీజేపీయేతర కూటమి ఆవిర్భావం వల్ల పెద్దగా ప్రయోజనం ఉందన్న విషయాన్ని చంద్రబాబు అటు బీజేపీనీ, ఇటు కాంగ్రెస్ నూ వ్యతిరేకించే పార్టీలకు నచ్చచెప్పడంలో సఫలీకృతులయ్యారు. అందువల్లే కూటమి ఆవిర్భావంపై ఇప్పుడు అందరూ సానుకూలత వ్యక్తం చేస్తున్నారని చెప్పక తప్పదు. అయితే ఇప్పటికీ కూటమిలో కాంగ్రెస్ కు పెద్దన్న పాత్ర  కట్టబెట్టేందుకు  కూటమి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్న పలు పార్టీలకు ఆమోదం లేదు. అందుకే కాంగ్రెస్ ను ఒప్పింది…కూటమిలో మిగిలిన భాగస్వామ్య పక్షాలతో పాటుగా కాంగ్రెస్ కూడా ఒక పక్షంగా ఉండేందుకు ఒప్పించారు. ముందు దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ మరో సారి అధికారం చేపట్టకుండా సమష్టిగా ముందుకు సాగడమే లక్ష్యంగా కూటమి అవసరాన్ని అందరూ అంగీకరించేలా చెప్పగలిగిన ఫలితమే నేటి భేటీ. భేటీతోనే అంతా అయిపోయిందని భావించలేం. మోదీ హయాంలో ఫెడరల్ స్ఫూర్తిని కాలరాశారని బీజేపీయేతర రాష్ట్రాలు భావిస్తున్న నేపథ్యంలో ముందుగా ప్రాంతీయ పార్టీల గొంతును బలంగా వినిపించేందుకు జాతీయ స్థాయిలో బలమైన కూటమి విషయానికే పరిమితమయ్యేలా ఆయన బీజేపీయేతర పార్టీలను ఒప్పించారని పరిశీలకులు అంటున్నారు.  ఒక వేళ తెలంగాణ ఎన్నికలలో కూటమి విజయం సాధించి అధికారం చేపట్టడానికి అవసరమైన స్ధానాలను గెలుచుకుంటే కచ్చితంగా కూటమిలో బాబుమాటే చెల్లుబాటు అవుతుంది. అలా కాకపోయినా…కూటమి ముందుకు సాగేందుకే అవకాశాలు ఉన్నాయి. ఒక్క తెలంగాణ ఎన్నికల ఫలితం మాత్రమే కూటమి ఏర్పాటును నిర్ణయించలేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ ఎన్నికలలో బీజేపీ ఎంత మేరకు ఫలితాలు సాధిస్తుందన్న దానిపై కూడా కూటమి బలోపేతం కావడం ఆధారపడి ఉంటుంది.