జనసేనకు బలం ఉంటే సరిపోతుందా!?

పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు అభిమానులు తక్కువేమీ లేరు. సినీ హీరోగా ఆయనకున్న అభిమానులు గానీ, పవన్ రాజకీయాల్లో ఏదో సాధిస్తారన్న ఆశతో ఆయనకు మద్దతు పలుకుతున్న వారు గానీ తక్కువేం లేరు. సినిమా అభిమానులు రాజకీయాలలో కూడా మద్దతు ఇస్తారనుకోవడం భ్రమ అనే వారూ లేకపోలేదు, అది వేరే విషయం.

పవన్ మాత్రం చాలా ధీమాగా వ్యవహరిస్తున్నారు. మొదట మొదట అనలేదు కానీ కొద్ది కాలంగా రాష్ట్రంలో సొంతగా అధికారం చేపట్టడమే జనసేన లక్ష్యమని ఆయన తరచూ అంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీని ఇటు వైఎస్‌ఆర్‌సిపిని ఏకకాలంలో విమర్శిస్తూ వస్తున్నారు. నిజానికి మొదటి నుంచీ అటు అధికారపక్షం ఇటు ప్రతిపక్షం, పవన్ మద్దతు తమకే లభిస్తుందన్న అశతో ఉన్నాయి. బయటకు కనబడక పోయనా ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి. వాటికి అనుగుణంగా ఆ రెండు పార్టీల బహిరంగ విమర్శల స్థాయి ఉంటూ వచ్చింది.

తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో అన్న మాటలు అధికారపక్షంతో జనసేన జంట కట్టవచ్చన్న భావనకు దారి తీశాయి. అది కూడా రెండో రోజే తుస్సుమన్నది. తాను ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదనీ, 175 సీట్లలో జనసేన పోటీ చేస్తుందనీ పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు మాటలతో ఇద్దరూ ఒకటే అంటూ విమర్శల పర్వం లోకి దిగిన వైఎస్‌ఆర్‌సిపి తాజాగా పవన్ ప్రకటనతో మౌనం వహిస్తున్నది.

పవన్ మాటలపై ఆధారపడి ఇదే ఇక జనసేన దారి అనేం అనుకోనక్కర లేదు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేం. ఇప్పడు కాదన్నవారే రేపు కలవవచ్చు. అలా కాకుండా జనసేన దారి ఒంటరి పోరాటమే అయిన పక్షంలో మరి ఆయన వ్యూహం ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తుంది. జనసేన ఆవిర్భవించి నాలుగేళ్లు దాటిపోయింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ ఆ పార్టీని విస్తరించేందుకు, సంస్థాగతంగా నిర్మించేందుకూ ఎలాంటి ప్రయత్నమూ జరగలేదనే చెప్పాలి. తమకు లభించిన సమయాన్ని పవన్ సద్వినియోగం చేసుకోలేక పాయారు.

సంస్థాగతంగా నిర్మాణం లేకుండా జనసేన లక్ష్యసాధనలో ఎలా ముందుకు వెళుతుందన్న ప్రశ్న ఇంతకాలంగా అందరినీ వేధిస్తూనే ఉంది. ఈ ప్రశ్న తమకుఎదురయినపుడు జనసేన వర్గాలు ‘మా వ్యూహం మాకు ఉందిలే, సమయం వచ్చినపుడు బయటపెడతాం’ అని చెబుతూ వచ్చారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ వైఫల్యానికి అధికారదాహం ఉన్న కొందరు నాయకులు కారణమనీ, జనసేనకు ఆ గతి పట్టకుండా తాను జాగ్రత్త వహిస్తున్నారనీ ఆయన తాజాగా పేర్కొన్నారు. కోవర్టులు అనే పదం వాడకపోయినప్పటికీ ఆయన ఉద్దేశ్యం అదేనన్న సంగతి స్పష్టం అవుతూనే ఉంది. ఇక మీదట సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.

జనసేన అధికార ప్రతిపక్ష పార్టీలలో ఏదో ఒకదానితో జత కట్టినట్లయితే ఇకమీదట చేయబోయే సంస్థాగత నిర్మాణం ఆ పార్టీకి ఎంతోకొంత ఉపయోగపడవచ్చు. కానీ పార్టీ అధినేత ఆ దారిలో నడిచేదే లేదని అంటున్నారు. అదే నిజమయితే ఇప్పడు మొదలుపెట్టి రాత్రింబవళ్లు కష్టపడినా జనసేన సొంతగా ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలలో పాలుపంచుకుని, తమ మద్దతుదారుల వోట్లు బాలెట్ పెట్టె దాకా తీసుకువెళ్ల గలిగే స్థాయికి సంస్థగతంగా సిద్ధమవడం చాలా కష్టం. కానీ ప్రయత్నం తప్పదు. ఆ ప్రయత్నం కనీసం ఇప్పడన్నా చిత్తశుద్ధితో మొదలవుతుందేమో చూడాలి.