పెరిగిన ఓటింగ్ శుభపరిణామం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. జయాపజాయాలు ఎవరివన్నది 11వ తేదీన తేలిపోతుంది. అయితే ఎన్నికలు జరిగిన తీరు, పెరిగిన పోలింగ్ శాతం మాత్రం కచ్చితంగా హర్షించాల్సిన విషయమే. మొత్తం మీద ఐదు రాష్ట్రాలలోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హోరాహోరీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చెదురుమదురు సంఘటనలు వినా ఎన్నికలు ప్రశాతంగా ముగియడం ఆనందదాయకం. ఎన్నికలకు ముందు రెండు రోజులు పాటు వరుసగా జరిగిన సంఘటనలు పోలింగ్ రోజు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందా అన్న అనుమానాలను కలిగించాయనడంలో సందేహం లేదు. ఇక తెలంగాణ విషయంలో ఓట్ల గల్లంతు ఒక పెద్ద సమస్యగానే కనిపిస్తున్నది. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో పేరు ఉండి కూడా ఓటర్ల జాబితాలో పేరు ఎలా గల్లంతైందన్నదానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పి తీరాలి. ఒక్కొక్క చోట గంపగుత్తగా ఓట్లు గల్లంతవ్వడం వెనుక ఏదో కుట్ర ఉందన్న విపక్షాల ఆరోపణలను పరిగణనలోనికి తీసుకుని సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఇక ఈవీఎంల మొరాయింపు సంఘటనలు కూడా ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టేవిగానే ఉన్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంలోనూ…సమస్య ఉత్పన్నమైనప్పుడు దానిని సత్వరమే పరిష్కరించడంలోనూ కూడా నిర్లక్ష్యం కనిపించిదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇక ముందైనా ఇటువంటివి పునరావృతం కాకుండా  అవసరమైన చర్యలు చేపట్టాలి.