రామమందిరంపై బీజేపీ-జేడీయూ భిన్నాభిప్రాయాలు

బీహార్ లో బీజేనీ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీల షరతులకు తలొగ్గి సీట్ల సర్దుబాటును ప్రకటించడానికి ముఖ్యకారణం రాజకీయ అనివార్యతే.  సీట్ల సర్దుబాటు ప్రకటన వెలువడిన అనంతరం బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్  చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం తేటతెల్లమైంది. 2019 ఎన్నికలలో విజయం సాధించాలంటే రామమందిరంపై కాదు…అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. రామమందిరం కాదు అభివృద్ధి అజెండాయే వచ్చే సార్వత్రిక ఎన్నకలలో ఎన్డీయేకు  విజయాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. సీట్ల సర్దుబాటు జరిగిన అనంతరం ఆయన ఈ మేరకు   బీజేపీకి ఒక సందేశం పంపారు. రామమందిర వ్యవహారం కోర్టుల్లో లేదా పరస్పర అంగీకారంతో పరిష్కారం కావాలి తప్ప అది ఎన్నికల అంశం కారాదని స్పస్టం చేశారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బీహార్ లో బీజేపీ, జేడీయూలు చెరో 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తాయి. రామ్ విలాస్ పశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఆరు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తుంది. ఈ మేరకు ఆ మూడు పార్టీల మధ్యా అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అభివృద్ధి అంశానికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రామమందిర నిర్మాణం వంటి అంశాలు అభివృద్ధి ఎజెండాను పక్కతోవ పట్టించడానికి అంగీకరించబోనని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టే జేడీయూతో సీట్ల సర్దుబాటుకు బీజేపీ రాజకీయ అనివార్యతతోనే అంగీకరించిందన్న విషయం స్పష్టమౌతున్నది.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామమందిర నిర్మాణం తమ హయాంలో మాత్రమే జరుగుతుందనీ అందుకు తాము కట్టుబడి ఉన్నామని పదేపదే చెబుతున్నారు. ఆయనే కాకుండా బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులు కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రామమందిర నిర్మాణం ప్రధాన అంశంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. హిందువులు రామమందిర నిర్మాణం కోరుకుంటున్నారనీ, అది జరిగి తీరుతుందనీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అవసరానికి నితీష్ షరతులను అంగీకరించినట్లు కనిపిస్తున్నది.