30 రోజుల్లో 157 ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: మరొక్క నాలుగైదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని అంతా అంటున్నారు. తేదీలు ప్రకటించడానికి
సరిగ్గా నెల రోజుల ముందు నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చేశారో తెలుసా? దేశవ్యాప్తంగా 28 చోట్ల సుడిగాలి పర్యటనలు
చేయడంతో పాటు.. ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో 157 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్నికల తేదీలు ప్రకటించారంటే,
వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. దాంతో ప్రభుత్వం ఇలాంటి పెద్ద పెద్ద ప్రకటనలు ఏవీ చేయడానికి వీలుండదు. దాంతో
ఫిబ్రవరి 8 నుంచే మోదీ జాగ్రత్తపడ్డారు. అప్పటినుంచి మార్చి 9వ తేదీ వరకు పలు ప్రారంభోత్సవాలు చేశారు. హైవేలు, రైల్వే లైన్లు,
వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, స్కూళ్లు, విమానాశ్రయాలు, పవర్ ప్లాంట్లు.. ఇవన్నీ అందులో ఉన్నాయి. అదే 2014 ఎన్నికల
సమయంలో చూస్తే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చివరి నెలలో ఎలాంటి పర్యటనలు చేయనే లేదు. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 7
వరకు ప్రధాని మోదీ 57 ప్రాజెక్టులు ప్రారంభించారు. తర్వాతి నాలుగు వారాల్లో ఇది మూడు రెట్లు పెరిగింది. ఇదంతా ప్రధాని మోదీ
కార్యాలయ అధికారిక వెబ్ సైట్, ఇతర ప్రకటనల నుంచి వచ్చిన సమాచారమే.

సందట్లో సడేమియా అన్నట్లు ఇప్పటికే ప్రారంభమైన కొన్ని పాత ప్రాజెక్టులనూ మోదీ ప్రారంభించారు. ఉదాహరణకు అమేథీలో ప్రారంభించిన ఏకే తుపాకుల ఫ్యాక్టరీనే తీసుకుందాం. భారత్ – రష్యా సంయుక్త ప్రాజెక్టుగా దీన్ని పేర్కొన్నారు. కానీ, 2007లోనే ఇది ప్రారంభం అయ్యింది. 2010 నుంచే కార్బైన్లు, రైఫిళ్లు, ఇన్సాస్ మిషన్ గన్లు తయారుచేస్తోంది. బిహార్ లోని కర్మాలిచాక్ వద్ద మురుగునీటి వ్యవస్థకు ఫిబ్రవరి 17న మోదీ శంకుస్థాపన చేశారు. కానీ దీనికే.. ఆయనే 2017 అక్టోబరులో కూడా శంకుస్థాపన చేసేశారు. ఇక ప్రారంభించిన వాటిలో 140 వరకు అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ప్రారంభించాల్సినవి కానే కావు. చెన్నై మెట్రోలో ఒక భాగం, కర్ణాటకలో రైల్వేలైన్ డబ్లింగ్ లాంటివి దీనికి ఉదాహరణలు. ఘజియాబాద్ పట్టణంలో గోశాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన లాంటివైతే మునిసిపల్ చైర్మన్ స్థాయివి. అక్కడే 9వేల ఇళ్లకు ఉపయోగపడే 37 కి.మీ. మురుగునీటి వ్యవస్థ ప్రారంభం కూడా ఇలాంటిదే. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రధాని గత నెలలో 17 ప్రాజెక్టులను రిమోట్ కంట్రోలుతో ప్రారంభించారు. బిహార్ లోని ఒక పవర్ ప్లాంటును యూపీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన శనివారం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేస్తారా అని అంతా నోళ్లు నొక్కుకుంటున్నారు.